Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాజా: ఇజ్రాయిల్ దళాలు ఇవాళ ఉదయం గాజాలో దాడి చేశాయి. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపుపై జరిగిన అటాక్‌లో ముగ్గురు కమాండర్లు మృతిచెందారు. ఈ దాడిలో 12 మంది పాలస్తీనియన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో మరో 20 మంది గాయపడ్డారు.
మిలిటెంట్లను టార్గెట్ చేస్తూ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అయితే ఇస్లామిక్ జిహాదీలు ప్రతీకార దాడులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌పై రాకెట్లతో అటాక్ చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయిల్‌కు చెందిన దాదాపు 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గాజాలో దాడి చేశాయి. ఇండ్లను టార్గెట్ చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొన్నిచోట్ల అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి. ముగ్గురు మిలిటెంట్లను టార్గెట్ చేసేందుకు తమ విమానాలు 10 కేంద్రాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఆరు ఇస్లామిక్ జిహాదీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. తమ దళానికి చెందిన ముగ్గురు కమాండర్లు మృతిచెందారని ఇస్లామిక్ జిహాదీ మిలిటరీ వింగ్ అల్ ఖుద్స్ బ్రిగేడ్స్ తెలిపింది. మృతుల్లో జిహాద్ షాకేర్ అల్ ఘన్నామ్, కమాండర్ ఖలిల్ సలాహ్ అల్ భతిని, మిలిటెంట్ లీడర్ తారిక్ మొహమ్మద్ ఇజదీన్ ఉన్నారు.