Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు అర్థరాత్రి ఇంట్లోకి దూసుకొచ్చి, అందరినీ బందీలుగా చేసుకుని.. రూ.1.3 కోట్ల నగదు, 2 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. వారిలో తండ్రి కాంట్రాక్టరు కాగా, కుమారుడు పేపర్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల అర్థరాత్రి దాటిన తర్వాత ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కిటికీల గ్రిల్స్ కత్తిరించి ఇంట్లోకి చొరబడ్డారు. దుండగులు తమవెంట కత్తులు, తుపాకులు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులను నిద్రలేపి, నదుటిపై తుపాకీ గురిపెట్టి వారిని కట్టిపడేశారు. ఇంట్లో బంగారం, నగదు దోచుకున్నారు. ఈ చోరీ గురించి పోలీసులు ఫిర్యాదు చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి మరీ ఘటనా స్థలం నుంచి జారుకున్నారు. వారు వెళ్లిన తర్వాత ఎలాగోలా ఒకరినొకరు విడిపించుకున్న బాధితులు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల ముఠా అర్థరాత్రి దాటిన(2.45) తర్వాత పారిపోతున్న దృశ్యాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీకి పాల్పడడానికి ముందు వారు ఇంటివద్ద రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ఆ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తి పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.