Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. దుండగుడు జరిపిన కాల్పులలో ఐశ్వర్య తో పాటు మరో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని టెక్సాస్‌లో ఒక మాల్లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి మృతి చెందింది. అమెరికా కాలమానం ప్రకారం గత శనివారం మధ్యాహ్నం ఐశ్వర్య తన స్నేహితుడితో కలిసి టెక్సాస్‌లోని ఓ మాల్‌కు షాపింగ్‌కు వెళ్లింది. 3.36 గంటల సమయంలో.. అగంతుకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఏడుగురు క్షతగాత్రుల్లో ఐశ్వర్య స్నేహితుడు కూడా ఉన్నాడు.
కాగా.. ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఆమె. ఆ దంపతులకు శ్రీకాంత్‌రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. నర్సిరెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని గ్రాండ్ స్కూల్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎమ్మెస్ పూర్తి చేసి, టెక్సస్ సమీపంలోని పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కిందటి సంవత్సరం డిసెంబరులో తన అన్న శ్రీకాంత్‌రెడ్డి పెళ్లికి చివరిసారిగా భారత్‌కు వచ్చిందామె. శనివారం మధ్యాహ్నం మాల్‌కు వెళ్లే ముందు ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత 5 నిమిషాలకే ఆమె తుపాకీ తూటాలకు బలైంది.