Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢిల్లీ: నేడు శివసేన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. శివసేన షిండే, థాకరే వర్గాల మధ్య వివాదం నెలకొంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమకోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్నాథ్ షిండే సుప్రీంను ఆశ్రయించారు. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ సుప్రీంను ఉద్ధవ్ థాకరే ఆశ్రయించారు. ఈ క్రమంలో 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి కేసును నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బదిలీ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పొందుపర్చిన అనర్హత అంశాలతో పాటు ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 సహా అనేక రాజ్యాంగపరమైన అంశాలపై సుదీర్ఘ వాదనలు వినిపించారు. స్పీకర్ను తొలగించాలంటూ ఒక పిటిషన్ పెండింగులో ఉండగా, ఆ స్పీకర్ అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకోవడం కుదరదు అని షిండే వర్గం వాదించింది. నబం రెబియా కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందని వెల్లడించారు.