Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కృష్ణా: పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు.
అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.