Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేసీఆర్ బీజేపీకి,మోడీ, అమిత్ షా కు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేది శుద్ద అబద్ధం అని, వారి మధ్య బలమైన బంధం ఉన్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అమిత్ షా కేంద్రంలో సహకార శాఖ మంత్రి కూడా అవుతారని, అమిత్ షా ఆదేశాలతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ అనే పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఆమోదం తెలిపారని,ఈ విషయం ఇతర తలసాని వంటి వారికి తెలియదని సెటైర్లతో తీవ్రంగా విమర్శించారు. ఇదే కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న నందిని అనే పాల కంపెనీని మూసియాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడి అమూల్ కంపెనీని రానియ్యలేదని తెలిపారు. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ లోని వర్గల్ లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించారన్నారు. తెలంగాణ రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు చెందిన విజయ పాల కంపెనీకి ప్రభుత్వం గత రెండేళ్లుగా కనీసం ఎండిని కూడా ఎందుకు నియమించలేదని నిలదీశారు. రావిర్యాల ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడంలేదన్నారు. కేంద్రంలో బీజేపీ రిలయన్స్ కంపెనీ లాభాల కోసం బిఎస్ఎన్ఎల్ కంపెనీని చంపినట్లే,తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీలను చంపి,అమూల్ కంపెనీని తెస్తున్నారని మండిపడ్డారు. కిసాన్ సర్కార్ అంటే రాష్ట్రంలోని పాడి రైతుల పొట్టకొట్టడమేనా అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ నినాదం రైతులను మోసం చేయడానికేనని పేర్కొన్నారు. తన కూతురు కవితను ఈడీ విచారణ నుండి కాపాడడానికే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ముందు బీజేపీకి, మోడీ అమిత్ షా లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని డ్రామాలు చేస్తూ,తెరవెనక దోస్తీ చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లాలో ఒక యువతిపై ఎస్ఐ దాడి చేయడాన్ని తప్పుబట్టారు.షీ టీమ్స్ మహిళా పోలీసులు ఎక్కడ పోయిండ్రని, పోలీసులే ఇలా మహిళల పట్ల వివక్ష చూపుతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులు మహిళలకిచ్చే గౌరవం ఇదేనా అని విమర్శించారు.