Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితున్ని గ్రామస్తులకు అప్పగించాలని ఆందోళన
- పోలీసు వాహనాలు ధ్వంసం
- గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి
నవతెలంగాణ-మంథని; పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కన్న తండ్రే కూతురిని కర్కశంగా మారి గొడ్డలితో నరికి చంపి,మరొకరిపై దాడి చేయడంతో గ్రామంలో పరిస్థితులు ఒక్కసారిగా చేయి దాటిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిందితుడికి తామే శిక్ష విధిస్తామంటూ గ్రామస్తులంత ఏకమై అతని వెంట పడుతుండడంతో పోలీసులు వారిని నిలువరించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం కూతురు రజితను(10)గొడ్డలితో నరికి చంపి గ్రామంలోని మరో వ్యక్తి ధూపం శ్రీనివాస్ పై దాడి చేశాడు. శ్రీనివాస్ అరుపులతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి రక్షించి హాస్పిటల్ కు తరలించారు.హత్య గురించి సమాచారం అందుకున్న మంథని పోలీసులు బట్టుపల్లికి చేరుకొని నిందితుడు సదానందమును అదుపులోకి తీసుకున్నారు.దీంతో గ్రామస్తులు అగ్రహంతో మండిపడుతూ గ్రామం నుండి పోలీసు వాహనం కదలకుండా అడ్డుకున్నారు.పోలీస్ వాహనానికి అడ్డంగా కట్టెలు వేసి పోలీసు వాహనంలో ఉన్న నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు గ్రామస్తులను నిలువరించలేక కొంతసేపు ఇబ్బందులు పడ్డారు. నిందితున్ని తమకు అప్పగించాలని ఊగిపోతూ పోలీసుల వాహనాలపై గ్రామస్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.పెద్ద ఎత్తున గ్రామస్తులు పోలీసుల అదుపులో ఉన్న సదానందమును తమకు అప్పగించాల్సిందేనంటూ వాహనం వద్దకు వెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో గ్రామస్తులు నిందితునిపై దాడి చేసేందుకు కారంపొడి తీసుకువచ్చి అతనిపై చల్లెందుకు ప్రయత్నించాగా వారిని వాహనం వద్దకు రాకుండా పోలీసులుఅడ్డుకున్నారు. నిందితుడు సదానందం గతంలో అతని భార్యను చంపిన కేసులో కూడా జైలు జీవితం గడిపి వచ్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేక సైకోలా వ్యవహరించిన సదానందం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్ల ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మంథని ఎస్సై వెంకటేశ్వర్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని నిందితుడు సదానందంను అదుపులోకి తీసుకొని, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.నిందితుడు సదయ్యను మంథని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.