Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. ధరణి పోర్టల్ తీసుకువచ్చి పేదల భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు. ఆయన చేస్తున్న పీపుల్స్ మార్చ్ యాత్ర 56వ రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. తెలంగాణ లక్ష్యాన్ని, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. మన భూములు, మన నీళ్లు మనకే అని కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా వెనక్కి గుంజుకుందని, పేదలకు భూములు లేకుండా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టా పాస్ బుక్ పుస్తకాలు ఇవ్వగా.. బిఆర్ఎస్ ప్రభుత్వం వారి భూములను ధరణిలో పార్ట్ బి నమోదు చేసి కొల్లగొట్టే కుట్ర చేస్తుందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న చుక్కనీరు ఇవ్వలేదని అన్నారు.