Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హనుమకొండ: హనుమకొండ జిల్లా సుబేదారి పీఎస్పరిధిలోని భవానీ నగర్లో వరకట్న వేధింపులతో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..వర్ధన్నపేట మండలం కడారిగూడానికి చెందిన కుందూరు మల్లారెడ్డి కూతురు నిహారిక రెడ్డిని కేశవాపూర్గ్రామానికి చెందిన రేవూరి గంగాధర్ రెడ్డికి ఇచ్చి 2021 ఆగస్టులో పెండ్లి జరిపించారు. పెండ్లి టైంలో కట్న కానుకల కింద రూ.3 లక్షలు క్యాష్, రూ.కోటి విలువైన ప్లాట్, 8 తులాల బంగారం ఇచ్చారు. ఆడపడుచు కానుకల కింద మరో రూ.2 లక్షలు కూడా అందజేశారు.
నిహారిక, గంగాధర్ రెడ్డిలకు ఒక పాప ఉంది. అయితే, గంగాధర్ రెడ్డి అదనపు కట్నం కోసం నిహారికను ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడు. అదనంగా రూ.4.5 లక్షలు ఇవ్వాలంటూ వేధించడంతో నిహారిక మనస్తాపానికి గురైంది. వేధింపులు ఎక్కువ కావడంతో బుధవారం తన తండ్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆయన తన కూతురు వద్దకు వెళ్లగా.. అల్లుడు గంగాధర్‌రెడ్డి, అతని తల్లి మనోహర, ఇతర కుటుంబసభ్యులు తిట్టి పంపించేశారు. కాగా, గురువారం ఉదయం నిహారిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గంగాధర్ రెడ్డి ..తన మామకు ఫోన్ చేసి చెప్పాడు. షాక్‌కు గురైన మల్లారెడ్డి నిహారిక మృతిపై అనుమానాలున్నాయని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.