Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంతకాలంగా ఈ ఆడవి ప్రాంతంలో సంచరిస్తోంది. ఈ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుత్ షాక్ గురై మృతి చెందగా మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వకొండవైపు వెళ్లిపోయాయని వారు తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండవైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.