Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త.. తన భార్యను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లపోచమ్మవాడకు చెందిన కుంచం రాజ్‌కుమార్ హైకోర్టు వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శోభ(40), ఇద్దరు కుమారులతో కలిసి గత రెండేళ్లుగా వనస్థలిపురంలోని గౌతమినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఏదో విషయంలో దంపతులిద్దరూ తీవ్రస్థాయిలో గొడపపడ్డారు. ఈ విషయం కుటుంబ పెద్దల వరకు వెళ్లడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్‌కుమార్, శోభ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఉన్న రాజ్‌కుమార్ భార్య శోభపై చేయి చేసుకున్నాడు. ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు పైఅంతస్తు నుంచి కిందికి పరిగెత్తింది. రాజ్‌కుమార్ కత్తితో ఆమెను వెంబడించి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తల్లిపై దాడికి పాల్పడిన తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పెద్దకుమారుడు సాత్విక్ (15) కూడా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి రాజ్‌కుమార్ పరారయ్యాడు. తల్లిని హత్య చేస్తుండగా చూసిన సాత్విక్ పీఎస్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఎల్బీనగర్ డీసీపీ శ్రీసాయి, ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.