Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలాఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కసరత్తు చేస్తున్నది. అన్ని గురుకులాలకు ప్రభుత్వం 11,687 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో బోధన సిబ్బంది పోస్టులు 10,675 కాగా, మిగిలినవి 1,012 బోధనేతర పోస్టులు. బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బోధనేతర సిబ్బంది పోస్టుల్లో స్టాఫ్ నర్స్ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్- 3, గ్రూప్- 4 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. ట్రిబ్ మొత్తంగా 10,675 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఇందులో తొలిదఫాగా 9,231 పోస్టుల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది.
తొలుత ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని, సర్వీస్ రూల్స్‌లో ఉన్న పోస్టుల 9,231 భర్తీకి ట్రిబ్ శ్రీకారం చుట్టింది. సర్వీస్‌రూల్స్, న్యాయవివాదాల్లో ఉన్న 1,444 పోస్టుల భర్తీని రెండో విడతలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో గురుకులాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యాషన్ డిజైనింగ్, అగ్రికల్చర్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫుడ్, న్యూట్రిషన్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభిన్న, ఉపాధిని ఇచ్చే కోర్సుల పోస్టులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించడంలో ట్రిబ్ నిమగ్నమైంది. సంబంధిత న్యాయ, వ్యవసాయ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలు, విషయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ నెలాఖరునాటికి అవన్నీ పూర్తి చేసి 1,300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ట్రిబ్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇవిగాక, దాదాపు 1,444 పోస్టులకు కొన్ని న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ సమస్యలన్నీ పరిషరించి నోటిఫికేషన్ జారీ చేయాలని ట్రిబ్ సన్నాహాలు చేస్తున్నది.