Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్షా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుండగా ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంకిత్ కుమార్ గోస్వామి అనే వ్యక్తి బారాబంకీ బీబీడీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు, కోడలితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న అంకిత్.. ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే రిక్షా నడిపి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే ఈరిక్షా బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ అంకిత్ భార్య రోలి, కుమారుడు కుంజ్, కోడలు రియా మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.