Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో మోచా తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌కు 680 కిలోమీటర్లు, మయన్మార్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈనెల 14న మధ్యాహ్నానికి కాక్స్ బజార్ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది.
అయితే, ప్రస్తుతం ఏపీలో పొడి వాతావరణం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగల 2.. 3 రోజుల్లో 4-6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నంద్యాలలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అన్నమయ్య జిల్లాలో 42.57 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 41.9, తూర్పుగోదావరిలో 41.8, విజయనగరంలో 41.8, ప్రకాశం 41.5, గుంటూరు 41.53, నెల్లూరు 41.4, ఏలూరు 41.38, కాకినాడ 41.3, పల్నాడు 40.9, పశ్చిమగోదావరి 40.82, ఎన్టీఆర్ జిల్లాలో 40.81, కడప 40.15, మన్యం 39.9, బాపట్ల 39.7, కోనసీమ 39.4, శ్రీకాకుళం 39.4, అల్లూరి జిల్లాలో 39.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.