Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని (సీఈఐఆర్) కేంద్రం ఈ వారంలో ఆవిష్కరించనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) రూపొందించిన ఈ సిస్టం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొన్ని టెలికం సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీన్ని తాజా గా మే 17న దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయి తే, ఇథమిత్థంగా తేదీని చెప్పనప్పటికీ ఈ త్రైమాసికంలో సీఈఐఆర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సీడాట్ సీఈవో రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల దొంగతనాల ఉదంతాలు తగ్గుముఖం పట్టేందుకు, చోరీకి గురైన..పోయిన మొబైల్ ఫోన్ల జాడలు కనుగొనడంలో పోలీసులకు సహాయకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. అలాగే, మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు వాడే ఐఎంఈఐ నంబర్ల క్లోనింగ్‌ను అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహాయపడగలదని వివరించారు. సీఈఐఆర్ విధానాన్ని ఉపయోగించి ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 పైచిలుకు ఫోన్లను రికవర్ చేసి, యజమానులకు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రత్యేక సిస్టం ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో మాత్రం లేదు. మొబైల్ నంబరుకు అనుసంధానమైన డివైజ్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ను కనిపెట్టేందుకు సీఈఐఆర్ తోడ్పడుతుంది.