Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మాతంగి వేషాలతో పొంగళ్లు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర చేపట్టగా.. విచిత్ర వేషధారణలతో భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి కూడా మాతంగి వేషంలో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. పుష్ప సినిమా పార్ట్ 2లో అల్లు అర్జున్ ధరించిన మాతంగి వేషధారణలో వచ్చిన ఎంపీ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మ సారెతో ఈ యాత్ర ప్రారంభమైంది. పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, బండ్ల వీధి మీదుగా గంగమ్మ గుడికి చేరుకుంది. ఈ యాత్రలో ఎంపీ గురుమూర్తి మాతంగి వేషంలో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. కళాకారుల మధ్యలో నిలబడి అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఆపై గంగమ్మ ఆలయం వరకూ డప్పు, మంగళ వాయిద్యాల మధ్య ఎంపీ గురుమూర్తి నడుచుకుంటూ వెళ్ళి అమ్మ వారిని దర్శించుకున్నారు. మాతంగి వేషంలో ఉన్న ఎంపీ గురుమూర్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.