Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వివాహమైన 4 నెలలకే ఆమె.. తన పుట్టింటి వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెండ్లి రోజుకు ముందు భర్త సైతం ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎస్సై మహేశ్ తెలిపిన వివరాలివీ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్‌కు చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్(35) జానపద గాన కళాకారుడు. హుస్నాబాద్‌లోని గోదాంగడ్డ కాలనీకి చెందిన శారదతో ఏడాది క్రితం శ్యాంసుందర్‌కు వివాహమైంది. భార్యాభర్తలు కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. పుట్టింటికి వచ్చిన శారద గతేడాది సెప్టెంబరు 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె మానసిక స్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడిందని నాడు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. భార్య మరణంతో శ్యాంసుందర్ ఆవేదనకు గురవుతున్నాడు. ఆమె లేకుండా ఒంటరి జీవితం భరించలేనంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ చెప్పేవాడు. వారి పెండ్లి రోజు మే 15 కాగా.. శ్యాంసుందర్ 14న రాత్రి హుస్నాబాద్‌లోని అత్తవారింటి ముందు తన భార్య ఉరేసుకున్న చెట్టు కిందనే పురుగు మందు తాగి పడిపోయి మృతి చెందాడు. సోమవారం తెల్లవారాక స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.