Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. 2014 మే 26న భారత ప్రధానిగా మోడీ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2020 డిసెంబర్లో ఆయన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా 2021 అక్టోబర్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. దాదాపుగా పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి.ఈ నిర్మాణ పనులను కేంద్ర గృహ నిర్మాణ శాఖ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలకు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి, వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. ఇకు ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలైలో కొత్త భవనంలో జరుగుతాయని సమాచారం.