Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషాల్లో ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ :పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రతిపక్షాలకు పోటీగా అధికార పక్షం కూడా ఆందోళన చేపట్టింది. అదానీ అంశంపై ప్రతిపక్షాల నిరసనలు, పలువురు నేతలు నల్ల దుస్తులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మంగళవారం ఉభయ సభల కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలను హౌరెత్తించారు. దీంతో కేవలం రెండు నిమిషాల్లో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి అదానీ సమస్యపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాగితాలు చింపి స్పీకర్ చైర్‌పైకి విసిరారు. అలాగే నలుపు క్లాత్‌ను కూడా విసిరారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభను బుధవారానికి వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, నీతూ ఘంఘాస్, సావీటీ బూరాలకు అభినందనలు తెలిపింది. అనంతరం అదానీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించడంతో మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన సభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో చర్చకు నిర్ణయించిన బిల్లుల గురించి తెలియజేశారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు, వారిలో పలువురు నల్ల దుస్తులు ధరించి అదానీ అంశంపై రచ్చకు డిమాండ్ చేశారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.