Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతసామరస్యానికి కట్టడి అవసరం : సుప్రీం
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయడం అవసరమని పేర్కొంది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఓ పిటిషన్పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
విద్వేష ప్రసంగాలకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ మెహతాను ప్రశ్నించింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును బుధవారానికి వాయిదా వేసింది. విద్వేష ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనూ పేర్కొంది. ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఏదైనా జాప్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది.