Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ
- సిట్ అధికారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు
- సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్ వేయాలి
- ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లు సమయం ఇవ్వడం లేదు :ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ :టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు , కేటీఆర్‌కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై మంగళవారం నాడిక్కడ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ''ఈ కేసులో బ్యాంకు లావాదేవీల కంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. మనీలాండరింగ్, హవాలాతోపాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయి. కాబట్టి సిట్ ఒక్కటే ఈ కేసును విచారించలేదు. సీబీఐ, ఈడీ, ఏసీబీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి'' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు గత రెండు, మూడు రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతుంటే సీబీఐ, ఈడీ డైరెక్టర్లు తమకు సమయం ఇవ్వడం లేదన్నారు. ఈ మీడియా సమావేశం చూసైనా తమకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ''కానీ సిట్ అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెడితే..ఈ కేసులు ఏసీబీ పరిధిలోకి వెళ్తాయి. ఏసీబీ కోర్టుకు క్రిమినల్ కేసులను కూడా విచారించే అధికారం ఉంటుంది. తద్వారా విచారణ త్వరగా ముగుస్తుంది. సీబీఐకి కేసు ఇస్తే ఈడీ కూడా వస్తుంది. అప్పుడు ఇంకా సత్వరంగా కేసులు తేలే అవకాశం ఉంటుంది'' అని అన్నారు. ప్రస్తుతం నిందితుల మీద పెట్టిన సెక్షన్లు, సాధారణ కోర్టుల్లో విచారణ జరిగితే ఈ కేసు తేలడానికి ఏండ్ల సమయం పడుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి.. ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్ధం అని అన్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిందని, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం కేసును సిట్‌కు అప్పగించిందని తెలిపారు.
''ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు. గతంలో హై కోర్టుకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయనకు రెండు వారాల శిక్ష విధించింది. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న 30 లక్షల మంది, నమోదు చేసుకొని వారు 20 లక్షల మంది ఉంటారు. మొత్తం మీద 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న సమస్య. కేసీఆర్ కు తెలంగాణ విద్యార్ధులు నచ్చకపోవచ్చు. కానీ జీవితాలతో చెలగాటమాడే అధికారం కేసీఆర్, కేటీఆర్‌కు లేదు. తెలంగాణలో నిజాయితీ పరులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా ఆంధ్రా అధికారుల చేతుల్లోంచి విచారణను తప్పించాలి. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ బిడ్డలైతే తక్షణమే ఈ కేసును తెలంగాణ అధికారులతో జరిపించాలి. సీబీఐ, ఈడీ, ఏసీబీ డిపార్ట్ మెంట్స్ కలిపి సిట్ వేసి ఇందులో ఉన్న పెద్దలందరిని శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది'' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.