Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యుల ఆందోళన నడుమ ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : లోక్సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రవేశపెట్టింది. రాహుల్ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్లతో ప్రతిపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. నల్ల దుస్తుల ధరించి ప్రతిపక్ష నేతలు మోడీ ప్రభుత్వానికి నినాదాల హోరెత్తించారు. దీంతో ఉభయ సభల వాయిదాల పర్వం కొనసాగాయి. లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అటవీ సంరక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సభ ఆర్డర్లో లేదనీ, బిల్లును ఉపసంహరించు కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ, మొండిగా బిల్లును ముజువాణి ఓటుతో ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంపిటేషన్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. జాయింట్ కమిటీ నివేదించిన జీవవైవిధ్య (సవరణ) బిల్లును కూడా మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళ నతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు.