Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పోరాట కమిటీ నేతలు
- కేంద్ర మంత్రితో సహా వివిధ రాజకీయ పార్టీల నేతలకు వినతి
న్యూఢిల్లీ :వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అనుమతించబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థేతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తదితరులు కలిశారు. ఎలమరం కరీం (సిపిఎం), పి.సంతోష్ కుమార్ (సిపిఐ), అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), వి విజయసాయి రెడ్డి, భీశెట్టి సత్యవతి (వైసిపి), కె రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్ (టిడిపి), సందీప్ పాఠక్ (ఆప్), సిఎం రమేష్ (బిజెపి), తిరుమవలయన్ (విసికె)తో పాటు 14 మంది వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కలిశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే తమ పోరాటనికి సహకరించాలని, మద్దతు ఇవ్వాలని నేతలు ఆయా పార్టీల ఎంపిలను కోరారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని విమర్శించారు. 32 మంది బలిదానంతో, వేలాది మంది రైతులు ఇచ్చిన భూములతో ఈ స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం రైతులు 23 వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నరోజు నుండి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన లావాదేవీలు, లీగల్ సలహాదారులను తాము అనుమతించలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని, కానీ డివిడెండ్ల, పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రూ.50 వేల కోట్లకుపైగా ఇచ్చిందని తెలిపారు. దేశంలోని ఈ స్టీల్‌ప్లాంట్‌కే సొంత గనులు కేటాయించడం లేదని, అయినప్పటికీ స్టీల్‌ప్లాంట్ పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరుకు మద్దతు ఇవ్వటం లేదని విమర్శించారు. తాము కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే, ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర మంత్రి, రాజకీయ పార్టీల నేతలను కలిసిన వారిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోద్య రాము, కెఎస్ఎన్ రావు, వరసాల శ్రీనివాసరావు, వై మస్తానప్ప, కారు రమణ, విల్లా రామ్మోహన్ కుమార్, జి. గణపతి రెడ్డి, ఎన్ వెంకన్న, కె శ్రీనివాస నాయుడు, డి సువర్ణ రత్నం తదితరులు ఉన్నారు.