Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయమంత్రికి 323 మంది సుప్రీం, హైకోర్టు న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ : ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కొందరు రిటైర్డ్ జడ్జిలను 'దేశ వ్యతిరేకులు'గా అభివర్ణిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన పలువురు న్యాయవాదులు స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హైకోర్టుల నుంచి 323 మంది సీనియర్ అడ్వొకేట్లు, లాయర్లు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన దేశానికి వ్యతిరేకమనో, దేశభక్తి లేనివారనో కాదని వివరించారు. కొందరు రిటైర్డ్ జడ్జిలు 'ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడానికి యత్నిస్తున్నారు' అని ఇటీవల మీడియా కాంక్లేవ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ న్యాయవాదులు తమ సంతకాలతో కూడిన లేఖను ఆయనకు రాశారు. వీరిలో సీనియర్ న్యాయవాదులైన ఇక్బాల్ చాగ్లే, రాజు రామచంద్రన్, కపిల్ సిబల్, దుశ్యంత్ దవే, చందర్ ఉదరు సింగ్, ఇందిరా జైసింగ్, రెబెక్క జాన్, నిత్య రామకృష్ణన్‌లు ఉన్నారు. విమర్శకుల పేరెత్తకుండా వారిని 'భారత వ్యతిరేక ముఠా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలతో రాజ్యాంగ పరిమితులను అతిక్రమించారని న్యాయవాదులు పేర్కొన్నారు. 'ఎవరూ తప్పించుకోలేరు', 'దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' వంటి వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను బెదిరించారని వివరించారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వమంటే దేశమని కాదనీ.. దేశమంటే ప్రభుత్వమనీ కాదని వివరించారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. తన పదవిని బట్టి, దేశంలో కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వారధి కాబట్టి కేంద్రమంత్రి గౌరవప్రదమైన బహిరంగ ప్రసంగాన్ని నిర్వహించాలని లేఖలో న్యాయవాదులు పేర్కొన్నారు.