Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్ విడుదల చేసిన లోక్‌సభ సెక్రెటేరియట్
న్యూఢిల్లీ : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ ఉపసంహరించుకుంది. ఈ మేరకు బుధవారం లోక్‌సభ సెక్రెటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. తన అనర్హతకు వ్యతిరేకంగా ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా లోక్‌సభ సెక్రెటేరియట్ అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది. 2009లో జరిగిన దాడి కేసులో మహ్మద్ ఫైజల్‌ను దోషిగా తేల్చుతూ కావరత్తి సెషన్స్ కోర్టు ఈ ఏడాది జనవరి 11న తీర్పునిచ్చింది. పదేండ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. తీర్పు వెలువడిన మూడ్రోజుల తర్వాత జనవరి 13న లోక్‌సభ సెక్రెటేరియట్.. ఫైజల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 18న లక్షద్వీప్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది.
అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు జస్టిస్ కురియన్ థామస్ ధర్మాసనం.. సెషన్స్‌కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ జనవరి 25న ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ సవాల్ చేసింది. ఫిబ్రవరి 20న జస్టిస్ కె.ఎం జోసెఫ్, జస్టిస్ బి.వి నాగరత్నలతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
అయినప్పటికీ ఫైజల్‌ను పార్లమెంట్‌కు అనుమతించలేదు. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రతిరోజూ ఆయన పార్లమెంట్‌కు వెళ్తున్నారు. కానీ భద్రతా సిబ్బంది ఆయనను సభ లోపలకి అనుమతించలేదు.
ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంటూ ఫైజల్ లోక్‌సభ కార్యదర్శిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం లోక్‌సభ సెక్రెటేరియట్ ఫైజల్‌పై అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ''కేరళ హైకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్8, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1) సి నిబంధనలకు లోబడి మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును నిలిపివేస్తున్నాం'' అని నోటిఫికేషన్లో పేర్కొన్నది.