Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రూ.2,235.08 కోట్లతో వరంగల్-ఖమ్మం మధ్య జాతీయ రహదారుల విస్తరణ చేపట్టనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం (ఎన్హెచ్163జి) సెక్షన్లో వరంగల్ జిల్లాలోని వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు 39.410 కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదించినట్టు తెలిపారు. ''యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే'' కింద నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.1,111.76 కోట్ల ఆమోదించామని పేర్కొన్నారు. ఇది అదర్ ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్(ఓ)) కార్యక్రమం కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో అభివృద్ధి చేయబడుతుందని తెలిపారు.
వరంగల్-ఖమ్మం ( ఎన్హెచ్163జి) సెక్షన్లో తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గ్రామం వరకు 30.830 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇది కూడా అదర్ ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్(ఓ)) కార్యక్రమం కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో అభివృద్ధి చేయబడుతుందని తెలిపారు. ఈ రెండు రహదారులను కలిపి మొత్తం 70 కిలోమీటర్ల రహదారిని ''హైబ్రిడ్ అన్యుటీ మోడ్''లో నిర్మాణం జరుగుతోందని, మొత్తం రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చులో ''భారత జాతీయ రహదారుల సంస్థ'' (ఎన్హెచ్ఏఐ) 40 శాతం, ప్రైవేట్ సంస్థలు 60 శాతం భరించాలని తెలిపారు. ''యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే సెక్షన్'' కింద నిర్మాణం జరిగే రహదారులన్నీ కొత్తగా భూసేకరణ చేసి, వ్యవసాయ భూముల్లో నిర్మాణం జరిగే రహదారులని, చాలా వేగంగా వాహనాలు వెళ్ళేందుకు అనువైన రహదారులుగా నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే అక్కడక్కడ 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల వద్ద, ఇతర రహదారుల నుంచి వాహనాల రాకపోకలకు వెసులుబాటు ఉండేలా ఈ రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.