Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళపై దుండగుల అఘాయిత్యం
- పార్కులోంచి ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో లైంగికదాడి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
బెంగళూరు: కర్నాటకలో బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే దారుణ ఘటన చోటు చేసుకున్నది. కొందరు దుండగులు ఓ మహిళను పార్కులో నుంచి బలవంతంగా లాక్కొచ్చి కదులుతున్న కారులో లైంగికదాడికి పాల్పడ్డారు. గతనెలలో జరిగిన ఈ ఘటన.. బాధితురాలి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుసిటీలోని కోరమంగళ ఏరియాలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో గత నెల (మార్చి) 25న బాధితురాలు తన స్నేహితునితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నది. అప్పుడు ఒక వ్యక్త్తి వారి దగ్గరకు వచ్చాడు. రాత్రిపూట పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. వాళ్లు ఆమెను బలవంతంగా పార్కులోంచి లాక్కొచ్చి ముందుగానే సిద్ధంగా ఉంచిన కారులోకి తోశారు. అనంతరం ఆ కారును వీధుల్లో తిప్పుతూ కదులుతున్న కారులోనే సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు.ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దుండగులు ఆమెను బెదిరించారు. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.