Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ జస్టిస్-ది రోడ్ ఎహెడ్ పేరుతో డీఎంకే మెగా సమావేశం
- హాజరుకానున్న 20 పార్టీల నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏప్రిల్ 3న 'సోషల్ జస్టిస్, ది రోడ్ ఎహెడ్' పేరుతో డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రతిపక్ష పార్టీలతో మెగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కనీసం 20 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు హాజరుకానున్నాయి. ఈ సమావేశంలో కొంత మంది నేతలు భౌతికంగానూ, మరికొంత మంది నేతలు ఆన్లైన్లో పాల్గొంటారు. ప్రతిపక్షాలను బలోపేతం చేయడానికి, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఈ సమావేశాన్ని పిలిచినట్లు ఊహాగానాల మధ్య, ఇది వివిధ సామాజిక సమస్యలపై చర్చించడానికి రాజకీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఎంకే నేతలు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే 'ది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్' అనే కాన్సెప్ట్ తొలి సమావేశం ఉద్దేశమని పేర్కొన్నారు. జనవరిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ఆలోచన చేశారని నేతలు తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, భారత రాష్ట్ర సమితి నాయకుడు కె కేశవరావు, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్, ఆప్ నేత సంజరు సింగ్ హాజరుకానున్నారు. ఎన్సీపీ, శివసేన (ఠాక్రే) పార్టీల తరపున పాల్గొనే ప్రతినిధులను ఇంకా ప్రకటించలేదు. అయితే, రెండు రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపినప్పటికీ, వైసీపీ, బీజేడీ సమావేశంలో పాల్గొంటారా? లేదా? అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఇది ప్రతిపక్ష ''రాజకీయ'' సమావేశం కాదని, సామాజిక సమస్యపై చర్చ అని పేర్కొన్న నేతలు, ఈ సమావేశానికి వైసీపీ, బీజేడీ హాజరవుతాయని అంటున్నారు.తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కీలకాంశాలతో సమావేశాన్ని ప్రారంభిస్తారు. అయితే, రాజకీయ నాయకులందరికీ సభను ఉద్దేశించి ప్రసంగించడానికి, వారి పార్టీ అభిప్రాయాలను తెలియజేయడానికి సమయం కేటాయిస్తారు.