Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ హైకోర్టు తీర్పుపై ట్విట్టర్లో కేజ్రీవాల్
- ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా..?
న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోడీ విద్యార్హతలను కోరినందుకు తనకు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు హైకోర్టు తీర్పుపై ఓ వెబ్సైట్ కథనాన్ని షేర్ చేస్తూ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాని ఎంతవరకు చదువుకున్నారని తెలుసుకునే హక్కు కూడా దేశానికి (ప్రజలకు) లేదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. '' వారి డిగ్రీని చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి..?, అసలేం జరుగుతున్నది. నిరక్షరాస్యుడు, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం'' అని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా, ప్రధాని డిగ్రీ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు అంతకముందు స్పష్టం చేసింది. దీనికి స్పందనగానే కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
మోడీ ఎంఏ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందచేయాలని గుజరాత్ వర్సిటీని ఆదేశిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై గుజరా త్ యూనివర్సిటీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఐసీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని విద్యార్హత వివరాలను ఆర్టీఐ కింద కోరిన కేజ్రీవాల్ రూ. 25,000 జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.