Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యులు అర్థం చేసుకునేలా ఉండాలి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : బిల్లుల ముసాయిదాలను సామాన్యులు అర్థం చేసుకునేలా సరళమైన భాషలో రూపొందించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. పార్లమెంట్‌కు న్యాయ, సిబ్బందికి సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని ముసాయిదా బిల్లులన్నీ దేశంలోని మేధావులు, చట్టపరమైన చతురత, పరిజ్ఞానం ఉన్నవారే అర్థం చేసుకోగలరని పేర్కొంది. ''పార్లమెంటుకు సమర్పించే బిల్లులను సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల, ప్రతిపాదిత లక్ష్యం గురించి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో బిల్లులను రూపొందించాలి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022, ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు-2022 వంటి బిల్లులను ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. వాటిని అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టం'' అని కమిటీ పేర్కొంది. ''శాసన విభాగం కీలకమైన ఆదేశం ఏమిటంటే, కీలకమైన ప్రభుత్వ పత్రాలను పరిశీలించడం, వివిధ మంత్రిత్వ శాఖల ముసాయిదా ఆర్డినెన్స్‌లు, బిల్లులను రూపొందించడంలో సహాయపడటం, తద్వారా అవి పార్లమెంటరీ, న్యాయపరమైన పరిశీలన సమయంలోమంచిగా ఉండగలవు'' అని కమిటీ తెలిపింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంతో సహా ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం నోడల్ ఏజెన్సీగా కూడా ఉందని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 1951, సంబంధిత ఎన్నికల నియమాలతో కూడా వ్యవహరిస్తుందని తెలిపింది. 2022 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు 28 శాసన బిల్లులను ప్రవేశపెట్టడానికి పార్లమెంటుకు పంపినట్టు శాసన విభాగం కమిటీకి తెలిపింది. పార్లమెంటు ముందు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఈ కాలంలో ప్రవేశపెట్టిన వాటిలో 23 చట్టాలుగా రూపొందించబడ్డాయని పేర్కొంది. అలాగే, ఈ కాలంలో ఆర్టికల్ 240 కింద ఆరు నిబంధనలను రాష్ట్రపతి ప్రకటించారు. 2,332 సబార్డినేట్ నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, నోటిఫికేషన్లు డిపార్ట్మెంట్తో పరిశీలించబడ్డాయని తెలిపింది.