Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 సెప్టెంబర్ నాటికి రూ.147.19 లక్షల కోట్ల అప్పు
- డిసెంబర్ నాటికి రూ.150.95 లక్షల కోట్లకు చేరుకున్న వైనం
- కేంద్రం అప్పులపై పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అప్పు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. మూడు నెలల్లో కేంద్రం అప్పు రూ.3.78 లక్షల కోట్లు పెరిగింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ (పీడీఎం) కేంద్ర ప్రభుత్వం అప్పులపై నివేదిక ఇచ్చింది. 2022 సెప్టెంబర్ చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లు ఉన్న అప్పు, డిసెంబర్ త్రైమాసికానికి అప్పు రూ.150.95 లక్షల కోట్లకు పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరలోని మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో మూడు నెలల్లోనే కేంద్రం రూ.3.78 లక్షల కోట్లు పెరిగింది. అంటే 2.6 శాతం అప్పు పెరిగిందని పేర్కొంది. 2022 డిసెంబర్ చివరి నాటికి రూ.1,50,95,970.8 కోట్లకు పెరిగినట్లు నివేదిక తెలిపింది. సెప్టెంబర్ 30 నాటికి రూ.1,47,17,572.2 కోట్ల అప్పు ఉందని పేర్కొంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లోనే రూ.3,78,398.6 కోట్లు పెరిగిందని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం బకాయి రుణాలలో ప్రభుత్వ అప్పు వాటా 89 శాతంగా ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఇది 89.1 శాతంగా ఉంది. దాదాపు 28.29 శాతం గడువు తేదీ ఉన్న సెక్యూరిటీలు ఐదేళ్ల కంటే తక్కువ కాల వ్యవధిని కలిగి ఉన్నాయి. 2022-23 మూడో త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 3,51,000 కోట్ల విలువైన మొత్తాన్ని సేకరించింది. అయితే రుణ క్యాలెండర్లో నోటిఫై చేసిన రూ. 3,18,000 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నోటిఫై చేసిన దాని కంటే ఎక్కువ అప్పు చేసినట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రైమరీ ఇష్యూల వెయిటెడ్ యావరేజ్ ఈల్డ్ 2022-23 రెండో త్రైమాసికంలో 7.33 శాతం నుండి మూడో త్రైమాసికంలో 7.38 శాతానికి పెరిగిందని తెలిపింది. 2022 డిసెంబరు 7న ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఉద్దేశ్యంతో పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు, 5.90 శాతం నుండి 6.25 శాతానికి పెంచాలని నిర్ణయించిందని పేర్కొంది. 2023 ఫిబ్రవరి 8న రిజర్వ్ బ్యాంక్ కీలకమైన ప్రధాన ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ కీలక బెంచ్ మార్క్ పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చింది.