Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చిలో 7.8 శాతానికి పెరుగుదల
- 36.7 శాతానికి పడిపోయిన ఉపాధి రేటు
- హర్యానాలో అత్యధికం...ఛత్తీస్గఢ్ అత్యల్పం
- సీఎంఐఈ నివేదిక స్పష్టం
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ రేటు మళ్లీ పెరిగింది. మరోపక్క ఉపాధి రేటు తగ్గింది. మూడు నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆదివారం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నది. మార్చిలో 7.80 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. పట్టణ నిరుద్యోగ రేటు 8.51శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.47 శాతం. ఇందులో జనవరిలో 7.14 శాతమున్న నిరుద్యోగ రేటు ఫిబ్రవరి నాటికి 7.45 శాతానికి పెరిగింది. అదికాస్తా మార్చిలో 7.80 శాతానికి పెరిగింది. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదైన అయిన రాష్ట్రాల్లో 26.8 శాతంతో హర్యానా, 26.4 శాతంతో రాజస్థాన్, 23.1 శాతంతో జమ్మూ కాశ్మీర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 20.7 శాతంతో సిక్కిం, 17.6 శాతంతో బీహార్, 17.5 శాతంతో జార్ఖండ్, 15.9 శాతంతో గోవా, 11.7 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 9.7 శాతంతో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మిగిలిన రాష్ట్రాలన్నీ జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటును నమోదు చేసుకున్నాయి. 0.8 శాతంతో ఛత్తీస్గఢ్ అత్యల్ప నిరుద్యోగ రేటు నమోదు చేసుకుంది.
ఉపాధి రేటు ఫిబ్రవరిలో 36.9 శాతం నుంచి మార్చిలో 36.7 శాతానికి పడిపోయింది. సంఖ్య పరంగా ఉపాధి రేటు 409.9 మిలియన్ల నుంచి 407.6 మిలియన్లకు పడిపోయింది. ''మార్చిలో దేశ కార్మిక మార్కెట్లు క్షీణించాయి. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 7.5 శాతం నుంచి మార్చిలో 7.8 శాతానికి పెరిగింది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఏకకాలంలో పడిపోవడంతో దీని ప్రభావం 39.9 శాతం నుంచి 39.8 శాతానికి పడిపోయింది'' అని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ తెలిపారు.
ఏపీలో స్వల్పంగా పెరుగుదల
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 7.5 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. అయితే ఏపీలో జనవరి నెలలో 5.5 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, ఫిబ్రవరి నాటికి 6.6 శాతానికి పెరిగింది. మార్చిలో 7.5 శాతానికి పెరిగింది. తెలంగాణలో 5.2 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. అయితే గత నెల ఫిబ్రవరి (5.8 శాతం) కంటే స్వల్పంగా తగ్గింది.