Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక చిత్రదుర్గలో పరీక్ష
బెంగళూరు : పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. కర్నాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఆదివారం పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్)ని చేపట్టింది. డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ పరీక్ష చేపట్టినట్టు ఇస్రో తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (సీఈఎంఐఎల్ఏసీ), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఆర్డీఈ) వంటి సంస్థలు ఈ పరీక్షకు సహకరించినట్టు పేర్కొంది.
ప్రపంచంలోనే తొలిసారి రెక్కలున్న లాంచ్ వెహికల్‌ను హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లినట్టు పేర్కొంది. అనంతరం ఆకాశం నుంచి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేసినట్టు వెల్లడించింది. ఆదివారం ఉదయం 7:10 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తిరిగి వినియోగించే లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వీ ) 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరినట్టు ఇస్రో తెలిపింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి దానికదే రన్‌వేపై ల్యాండ్ అయినట్లు చెప్పింది. చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఆదివారం ఉదయం 7:40 గంటలకు ఆటోమేటిక్ ల్యాండింగ్‌ను అది పూర్తి చేసినట్టు వెల్లడించింది. మానవరహిత రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వీ) అంతరిక్షం నుంచి చాలా వేగంగా, కచ్చితత్వంతో వచ్చి భూమిపై ల్యాండ్ అయ్యిందని ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.