Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి..విద్య..శిక్షణ.. ఏదీ లేదు
- 33 శాతం మంది భారతీయ యువత పరిస్థితిది
మోడీ పాలనలో దేశ యువత పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలియజేసే సమాచారమిది. భారత్‌లో మొత్తం 33 శాతం మంది యువత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి, విద్య, శిక్షణకు నోచుకోవటం లేదు. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కోవకు చెందిన వారే. ఇందులో మహిళల సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్హం. ప్రభుత్వా నికి చెందిన నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ)కు చెందిన మల్టిపుల్ ఇండికేటర్ సర్వేలో వెల్లడైన నివేదిక సారమిది. ఈ సర్వేలో భాగంగా 2021లో 2.76 లక్షలకు పైగా ఇండ్ల నుంచి సమాచారాన్ని సేకరించి రూపొందించిన ఈ నివేదికను ఇటీవలే విడుదల చేశారు.
- వీరిలో మహిళల సంఖ్యే ఎక్కువ
- ఎన్ఎస్ఎస్ఓ సర్వే సమాచారం
న్యూఢిల్లీ : భారత జనాభాలో మూడో వంతు ఉన్న యువతను మోడీ సర్కారు విస్మరిస్తున్నది. దేశంలోని యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నది 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి. అయితే, తొమ్మిదేండ్లు గడుస్తున్నా.. ఆ హామీని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నిలబెట్టు కోలేదు. దీంతో దేశ యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నది.
విద్య, ఉద్యోగం, శిక్షణను పొందలేకపోతున్నది. ఇప్పటికే పలు జాతీయ నివే దికలు ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా వెలువడిన ఎన్ఎస్ఎస్ఓ సర్వే నివేదిక సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది.
మహిళలకు పెండ్లి..ఇంటి పనులు
ఈ విషయంలో మహిళలు చేసే ఇంటి శ్రమ లెక్కలోకి రావడం లేదు. వారు తమ ఇంటి పనుల్లోనే (అన్‌పెయిడ్ డొమెస్టిక్ లేబర్) నిమగమై ఉండటంతో వారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నది. తాము ఇంటి పనుల్లో నిమగమై ఉన్నామని 90 శాతం మంది మహిళలు తెలిపారు. యువకుల విషయంలో ఇది 7.3 శాతంగానే ఉండటం గమనార్హం. లింగ అంతరం తనకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన ప్రొఫెసర్, ఆర్థికవేత్త, రచయిత లేఖ చక్రవర్తి అన్నారు. భారత్‌లోని అనేక కుటుంబాలు ఉద్యోగాల కంటే పెండ్లిండ్లను మహిళల 'ఆర్థిక భవిష్యత్తు'గా చూస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాల అలసత్వానికి తోడు.. భారత్‌లో ఉన్న సామాజిక పరిస్థితులు, ఆచారాలు, కుటుంబ కట్టుబాట్లు, మహిళలపై ఉన్న ఆంక్షలు వారిని ముందుకు సాగేలా చేయడం లేదని సామాజిక కార్యకర్తలు కొందరు ఆరోపించారు. 2021 సర్వే అంచనాల ప్రకారం.. 15-29 ఏండ్ల వయస్సున్న గ్రూపు సంఖ్య భారత జనాభాలో మూడోవంతు కావడం గమనార్హం.
యూపీలో లింగ అంతరం ఎక్కువ
ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ ఎక్కువ లింగ అంతరాన్ని కలిగి ఉన్నది. 2021కి సంబంధించిన సర్వే అంచనాల ప్రకారం యూపీ జనాభా దాదాపు 23 కోట్లు(12 కోట్ల మంది పురుషులు, 11 కోట్ల మంది స్త్రీలు). వీరిలో దాదాపు 30 శాతం మంది(6.8 కోట్ల మంది) 15-29 ఏండ్ల మధ్య వయసున్నవారే. వీరిలో మహిళల సంఖ్య 3.23 కోట్లు, పురుషుల సంఖ్య 3.67 కోట్లుగా ఉన్నది. వీరిలో 16 శాతం మంది యువకులు (ప్రతి ఆరుగురిలో ఒకరు) 'నీట్' జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో యువతుల సంఖ్య దాదాపు 60 శాతం (ప్రతి ముగ్గురిలో ఇద్దరు) గా ఉండటం ఆందోళనకరం.
జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలు
యూపీ తర్వాత నీట్ జాబితాలో పశ్చిమ బెంగాల్ (15.3 శాతం మంది యువకులు, 58.6 శాతం మంది యువతులు) ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, పంజాబ్, బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అసోం లతో పాటు బీహార్లు ఉన్నాయి. నీట్ విషయంలో తక్కువ లింగ అంతరంతో ఈశాన్య రాష్ట్రాలు పర్వాలేదనిపించాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 4.2 శాతం మంది యువకులు, 5.8 శాతం మంది యువతులు, మిజోరాంలో ఇది వరుసగా 3.5,7.7 శాతంగా ఉన్నది. నాగాలాండ్‌లో యువకులు 8.1 శాతం, యువతులు 18.1శాతంగా ఉన్నారు.
మహిళలు చేసే ఇంటి శ్రమ లెక్కలోకి రావడం లేదు. వారు తమ ఇంటి పనుల్లోనే (అన్‌పెయిడ్ డొమెస్టిక్ లేబర్) నిమగమై ఉండటంతో వారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నది. తాము ఇంటి పనుల్లో నిమగమై ఉన్నామని 90 శాతం మంది మహిళలు తెలిపారు. యువకుల విషయంలో ఇది 7.3 శాతంగానే ఉండటం గమనార్హం.
ప్రపంచ సగటు కంటే ఎక్కువ
ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో విద్య, ఉపాధి, శిక్షణ లేని (నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లారుమెంట్, ట్రైనింగ్ - నీట్) యువత (15 నుంచి 29 ఏండ్ల మధ్య ఉన్నవారు) సంఖ్య 33 శాతంగా ఉన్నది. అయితే, ఐక్యరాజ్య సమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచ సగటు 22 శాతంగానే ఉండటం గమనార్హం. భారత్‌లో లింగ అంతరం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. యువకుల్లో 15.4 శాతం మంది మాత్రమే ఈ జాబితా (నీట్)లో ఉండగా, యువతుల సంఖ్య 51.7 శాతంగా ఉన్నది.
'ఉద్యోగం కంటే పెండ్లిళ్లకే ప్రాధాన్యతనిస్తున్న తల్లిదండ్రులు'
దేశ యువతకు విద్య, ఉద్యోగం, శిక్షణ వంటివి అందకపోతున్నప్పటికీ.. వారిలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనే తపన అధికంగానే ఉన్నది. ఇక్కడ కూడా లింగ అంతరం కనిపిస్తున్నది. యువకులే (65.3 శాతం మంది) యువతుల (ఆరు శాతం) కంటే ఉపాధిని కోరటం లేదా ఉపాధి కోసం అందుబాటులో ఉంటున్నారు. 2013 మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనాన్ని ఉటంకిస్తూ చక్రవర్తి మాట్లాడుతూ.. మహిళలకు పెండ్లి అనేది ఒక ఆర్థిక నిర్ణయమని తెలిపారు. భారత్‌లోని మహిళలకు ఆర్థిక సాధికారత కోసం పెండ్లి ఒక సాధనమన్నారు. దీర్ఘకాలంలో.. విద్య, ఉద్యోగం కంటే మహిళకు చక్కగా పెండ్లి చేసి పంపించడమే పెద్ద నిర్ణయంగా తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. అలాగే, పెండ్లి తర్వాత మహిళలు చాలా మంది విద్య, ఉద్యోగాన్ని వదిలేస్తున్నారని చెప్పారు. ఇలాంటి కారణాలతో 'నీట్' అంచనాల్లో స్త్రీల సంఖ్య పెరుగుతున్నదని చక్రవర్తి వివరించారు. సమాజంలో మార్పు రానంత వరకు ఈ సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయం వ్యక్తం చేశారు.