Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్‌లపై 581 కేసులు
- ఐదేండ్లలో ఐఏఎస్‌లపై 44 సీబీఐ కేసులు, ఐపీఎస్‌లపై 12 కేసులు
ఒక్క ఛాన్స్ ప్లీజ్..అవినీతిరహిత భారతాన్ని నిర్మిస్తా..అంటూ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు దాటినా..అవినీతి అనకొండలా బుసలు కొడుతూనే ఉంది. అదానీ, కార్పొరేట్ల సంగతి అలా ఉంచితే...క్లర్క్ మొదలుకుని కలెక్టర్ల వరకూ కోట్లకు పడగలెత్తి...అధికారంలో ఎంతగా బొక్కితే అంతగా తమ గోడల్లో, బంకర్లుగా తయారుచేసుకున్న స్థలాల్లో కూడబెడుతున్నారు. మరి వారిపై కొరడా ఎందుకు ఝుళిపించటంలేదు.? అధికారులు,రాజకీయ నేతలు కలిసి కామన్ మ్యాన్ అవసరాలను షరాబులా కాటాపై లెక్కకట్టి మరీ దోచుకుంటుంటే..మోడీ మాత్రం దర్యాప్తు సంస్థల్ని ప్రత్యర్థి పార్టీలను, విరాళాలు ఇవ్వని సంస్థలను భయపెట్టడం వల్లే అవినీతి పడగలెత్తుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోడీ ఏమంటున్నారంటే...
న్యూఢిల్లీ : దేశంలో అవినీతికి అడ్డుకట్ట వేస్తామనీ చెప్పిన మోడీ సర్కారు ఆ హామీని మాత్రం చేతల్లో చూపెట్టలేకపోతున్నది. గత యూపీఏ పాలనలో అవినితిని లేవనెత్తుతూ ప్రసంగాలు చేసే మోడీ సర్కారు తమ పాలనలో నమోదవుతున్న అవినీతి కేసులను మాత్రం బయటకు రాకుండా చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అన్నారు. రాజకీయ నాయకులు చేసే పనులకు ఉన్నతాధికారులు బలి కావాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు గతంలో మోడీ సర్కారు వెల్లడి చేసిన గణాంకాలను ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్రం సమాచారం ప్రకారం.. గతేడాదిలో ఐఏఎస్ అధికారులపై 581 అవినీతి కేసులు నమోదయ్యాయి. 2019-20లో ఐఏఎస్ అధికారులపై 753 ఫిర్యాదులు వచ్చాయి. 2018-19లో ఆ సంఖ్య 643గా ఉన్నది. 2017-18లో 623 కేసులు, 2016-17లో 484 కేసులు, 2015-16లో 380 ఫిర్యాదులు ఐఏఎస్ అధికారులకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. 2016 నుంచి 2021 మధ్య ఐఏఎస్ అధికారులపై సీబీఐ సైతం 44 కేసులను నమోదు చేయగా, ఐపీఎస్ అధికారులపై 12 కేసులను నమోదు చేసింది.
సీబీఐ నేర నిరూపణ రేటు 67 శాతం
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక ప్రకారం.. 2021లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ రేటు 67.56 శాతంగా ఉన్నది. అంతకుముందు ఏడాది ఇది 69.83 శాతంగా ఉన్నది. 2021లో సీబీఐ మొత్తం 680 రెగ్యులర్ కేసులను నమోదు చేసింది. అలాగే, 67 ప్రాథమిక దర్యాప్తులను జరిపింది. ఇక 2020లో ఈ సంఖ్య 589 రెగ్యులర్ కేసులు, 87 ప్రాథమిక దర్యాప్తులుగా ఉన్నది. 2021లో 360 కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడ్డాయి. ఇందులో 202 కేసులు నేర నిరూపణ కాగా.. 82 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలారు. ఈ ఏడాది ముగింపు నాటికి మొత్తం 10,232 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, 982 కేసుల్లో దర్యాప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో ఈ సంఖ్య 1117గా ఉన్నది.
2021లో అవినీతి నిరోధక చట్టం కింద వివిధ నేరారోపణలకు సంబంధించి 457 కేసులు నమోదయ్యాయి. ఇందులో 549 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 221 మంది గెజిటెడ్ అధికారులు ఉండటం గమనార్హం. ఏడాది చివరినాటికి అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోసం 177 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ నివేదించింది. 6,697 కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్నది. డిపార్ట్మెంటల్ విచారణలు 921 ఉన్నాయి. అంతకముందు ఏడాది ఇవి 1341గా ఉన్నాయి.
భారత్‌లో అవినీతి పంజా
మోడీ పాలనలో అవినీతి చాపకింద నీరులా ప్రవహిస్తున్నది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ నివేదికలు ప్రతి ఏడాదీ ఎత్తిచూపుతున్నాయి. అయితే, మోడీ అనుకూల మీడియా మాత్రం ఈ విషయాన్ని దేశప్రజలకు తెలియ కుండా దాచిపెడుతున్నది.
భారత్‌లో అవినీతి వ్యాపిస్తున్న విషయంపై 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ' తన నివేదికలో పేర్కొన్నది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ఈ నివేదికలో ర్యాంకులను కేటాయించారు. ఇందులో భారత ర్యాంకు 40గా ఉండటం ఆందోళనకరం. ఆసియా పసిఫిక్ దేశాల్లో అవినీతి వ్యాపిస్తున్నదనీ, దానిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని 'అవినీతి అవగాహన సూచిక'లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇందులో భారత్ పొరుగుదేశాలైన ఆఫ్ఘనిస్తాన్ 24వ స్థానం, మయన్మార్ 23, పాకిస్థాన్ 27, శ్రీలంక36, మలేషియా 47వ ర్యాంకులో ఉన్నాయి.