Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరండి : బీజేపీయేతర సీఎంలకు స్టాలిన్ లేఖ
చెన్నై : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించేందుకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాల్సిందిగా బీజేపీ యేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను కోరారు. తమిళనాడు అసెంబ్లీలో దీనికి సంబంధించి కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞాపనలు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆమోదం పొందని బిల్లులను కాలదోషం పట్టినట్లుగా భావించాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. 'రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లకు పంపితే కొందరు వాటికి ఆమోదముద్ర వేయకుండా నిరవధికంగా పక్కన పెడుతున్నారు. దీనివల్ల కొన్ని విషయాలలో పాలన స్తంభిస్తోంది' అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో స్టాలిన్ వివరించారు. గవర్నర్లు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. అనేక రాష్ట్రాలలో సైతం ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టసభల సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల విధులను రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిందని, అయితే కొన్ని సందర్భాలలో అవి అమలుకు నోచుకోవడం లేదని స్టాలిన్ విమర్శించారు.