Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయ్‌గఢ్‌లో లోయలో పడిన బస్సు
- 13 మంది మృతి.. 29 మందికి గాయాలు
ముంబయి : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది మృతి చెందారు. 29 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయా ణిస్తున్నారు. రాయ్‌గడ్ జిల్లా ఖొపోలీ ప్రాంతంలో గల పాత ముంబయి -పూణే రహదారిపై ఉదయం ఐదు గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని గొరెగావ్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బయలు దేరింది. పుణేలోని పింప్రి చిచ్వాడ్ ప్రాంతంలో ఒక ఈవెంట్ కోసం బాజి ప్రభు వాదక్ గ్రూపునకు చెందిన సాంప్రదాయ సంగీత బృందాన్ని బస్సు తీసుకెళ్తున్నది. అయితే, రహదారిపై బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్నవారిని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీస్తున్నామని రారుగడ్ ఎస్పీ సోమనాథ్ ఘార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు, గాయపడినవారు సియాన్, ముంబయిలోని గొరెగావ్, పాల్ఘర్ జిల్లా విరార్‌కు చెందినవారని చెప్పారు. వీరిలో చాలా మంది 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారని అదనపు ఎస్పీ అతుల్ జెందే తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతిన్నది. మృతుల సంఖ్య పెరిగే అంశం ఉన్నదా? ప్రమాదానికి గల కారణాలు ఏమిటీ? అన్నవి ఇంకా తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ఆయన ప్రకటిం చారు. గాయపడిన వారి వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బస్సు ప్రమాదంపై బాధను వ్యక్తం చేసిన కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా.. దీనిపై మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో మాట్లాడినట్టు చెప్పారు.