Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రోజులు రిమాండ్ విధించిన సిబిఐ కోర్టు
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసిపి ఎంపి తండ్రి వైఎస్.భాస్కర్‌రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు పది మందితో కూడిన సిబిఐ అధికారుల బృందం రెండు వాహనాల్లో పులివెందులోని భాస్కర్‌రెడ్డి ఇంటికి వచ్చింది. కొన్ని నిమిషాలపాటు ఆయనను విచారించింది. ఆ సమయంలో ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. తన వ్యక్తిగత న్యాయవాదిని అనుమతించాలని భాస్కర్‌రెడ్డి కోరినా సిబిఐ అధికారులు స్పందించలేదు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి 120 బి సెక్షన్ కింద రెడ్‌విత్, 302, 201 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు పెట్టారు. ఈ విషయాన్ని వైఎస్ భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి, సమీప బంధువు జనార్థన్‌రెడ్డికి అరెస్టు మెమోలో తెలియజేశారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డిని తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సిబిఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట హాజరు పర్చారు. ఆయనను విచారిస్తే వివేకానంద రెడ్డి హత్య కుట్రలో కీలక వివరాలు తెలిసే అవకాశం ఉందని, పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. అరెస్టు అక్రమమని, రిమాండ్‌ను తిరస్కరించాలని భాస్కర్‌రెడ్డి తరుఫు న్యాయవాదులు వాదించారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఎక్కడా ఆగకుండా సుదీర్ఘ ప్రయాణంతో సిబిఐ అధికారులు హైదరాబాద్ తరలించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి... భాస్కర్‌రెడ్డికి ఈ నెల 29 వరకు ( 14 రోజులు) రిమాండ్ విధించారు. చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు
తీసుకోవాలని జైలు అధికారులకు సూచించారు. కస్టడీ పిటిషన్‌పై భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం సిబిఐ న్యాయస్థానంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు సిబిఐ అధికారులు తరలించారు.
సిబిఐ అధికారులు గతంలో వైఎస్ భాస్కర్‌రెడ్డిని పలుమార్లు విచారించడం, రెండ్రోజుల క్రితం అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని, ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం తెలిసిందే.
కీలక అంశాలు విస్మరిస్తున్న సిబిఐ : అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద హత్య కేసు దర్యాప్తులో సునీతతో సిబిఐ కుమ్మక్కు అయిందని ఎంపి వై.ఎస్.అవినాష్ రెడ్డి ఆరోపించారు. ధైర్యాన్ని కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటా మన్నారు. ఆదివారం తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ వార్త తెలియగానే వెంటనే పులివెందులకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. పులివెందులలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా కుమార్తె సునీత చెప్తున్న కోణంలోనే సిబిఐ దర్యాప్తు చేస్తోందని, కీలక అంశాలను విస్మరిస్తోందని ఆరోపించారు. వివేకా ఆస్తికి సంబంధించిన దస్త్రాలను, పేరు మార్పు పత్రాలను దాచి పెట్టమని ఆయన పిఎ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారని ఆరోపించారు. జమ్మలమడుగు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో వివేకా బావమరిది నరేడ్డి శివ ప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేకా చనిపోయిన విషయం చెప్పారని తెలిపారు. తన తండ్రి భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా సిబిఐ అరెస్ట్ చేసిందన్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందు చెప్పింది తానేనని తెలిపారు. సమాచారం ఇస్తే తననే దోషిగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గాలి మాటలు, గాలి కబుర్లు చెప్పడం లేదని, సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగానే చెప్తున్నానని అన్నారు. దస్తగిరి స్టేట్మెంట్లో కీలక అంశాలను సిబిఐ విస్మరించిందని విమర్శించారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరపాలన్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ముందస్తు బెయిల్‌కు సిబిఐ సహకరించిందని ఆరోపించారు. దస్తగిరికి బెయిల్ విషయంలో సునీత ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. రెండో భార్యకు ఆస్తి రాసి ఇవ్వాలని వివేకానంద రెడ్డి అనుకున్నారని, ఈ నేపథ్యంలో 2010లో షేక్ మహమ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి స్టాంప్ పేపర్ చోరీ జరిగిందన్నారు. దీనిపైనా, ఏప్రిల్ 3న సిబిఐ దృష్టికి తాను తీసుకొచ్చిన అభ్యర్థనలపైనా విచారణ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. హత్యలో పాల్గొన్న నలుగురి పేర్లనూ వాచ్మెన్ రంగన్న పోలీసులకు ఇప్పటికే చెప్పాడని తెలిపారు.