Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేతలు బృందాకరత్, కెఎం తివారీ పిటిషన్పై న్యాయస్థానం జోక్యం
- మూడు వారాల్లో స్పందించాలని ఆదేశం
న్యూఢిల్లీ : తీవ్ర ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో స్పందన తెలియజేయా లని పేర్కొంది. 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు ముందు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేశ్ వర్మ తదితరులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బృందాకరత్, కెఎం తివారీ దాఖలు చేయగా, ఆ పిటిషన్ను తిరస్కరించిన జూన్ 2022 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా 'దేశానికి ద్రోహం చేసిన వారిని కాల్చండి' అని అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను జస్టిస్ కెఎం జోసెఫ్ హైలైట్ చేశారు. తీవ్రమైన నేరం జరిగిందని పోలీసులు విశ్వసిస్తే కేసు పెట్టాల్సి ఉంటుందని జస్టిస్ కెఎం జోసెఫ్ అన్నారు. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఈ విషయం స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు. కేసు దాఖలు చేసి ఉంటే ప్రాథమిక దర్యాప్తును ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలని కూడా జస్టిస్ జోసెఫ్ సూచించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందస్తు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్ చేసిన తీర్మానం ప్రాథమికంగా తప్పు అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. కేసు నమోదు చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు రెండుసార్లు లేఖ రాశామని బృందా కరత్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ తెలిపారు. కేసు నమోదు చేసే ముందు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న మేజిస్ట్రేట్ తీర్మానం తప్పు, విద్వేషపూరిత ప్రసంగాలు గుర్తిస్తే వెంటనే కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశించిందని ఆయన వాదించారు. ప్రసంగాలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనకారులపై ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో 'గోలీ మారో' ప్రసంగం నిజమైన చర్యగా మారిందని సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులతో సహా ప్రతివాదులందరికి వివరణ తెలపాలని ఆదేశించింది.