Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడోదరలోనూ అదే తీరు
- ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే దాడులు
- తప్పుడు కేసులతో మైనారిటీలపై వేధింపులు
గత నెల 30న శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన శోభాయాత్రల సమయంలో మతోన్మాదం పడగ విప్పింది. గుజరాత్‌లోని వడోదర కూడా ఇందుకు మినహాయింపు కాదు. అది మధ్యాహ్నం ఒంటి గంట సమయం. ముస్లింలు మసీదులలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. అప్పుడే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రదర్శన మసీదు, దర్గా మీదుగా సాగుతోంది. పోలీసులను మోహరించినప్పటికీ విధ్వంసం, హింస యధేచ్ఛగా సాగాయి. ముస్లింలను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినప్పటికీ పోలీసులు మాత్రం బాధితులపైనే కేసులు పెట్టారు.
న్యూఢిల్లీ/వడోదర : మదీనా బీబీ ప్రతి రోజు మాదిరిగానే తన కుటుంబసభ్యులతో కలిసి ఫతేపురాలో ఇంటి బయట కూర్చుంది. ఇఫ్తార్ సమయం సమీపిస్తోంది. ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. శోభాయాత్రపై రాళ్లు రువ్వారంటూ తప్పుడు కేసు బనాయించారు. ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని మదీనా బీబీ వాపోయింది. ఈ నెల 3న వడోదర క్రైమ్‌బ్రాంచ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ అల్లర్లు, రాళ్లు రువ్వడం వంటి ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. అంతకుముందే హాతీఖానా-కుంభర్వాడా ప్రాంతంలో 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 4న రెండు మతాలకూ చెందిన మరో 60 మందిని అరెస్ట్ చేశారు. 13వ తేదీన మదీనా బీబీ కుటుంబసభ్యుల్లో నలుగురిని విడుదల చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 45 మంది ముస్లింల పేర్లు ఉన్నాయని, అందులో ఒక్క హిందువు కూడా లేడని నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎస్ఎం. ఇండోరి తెలిపారు. 'వీరికి బెయిల్ ఇప్పించడం చాలా కష్టమవుతోంది. ఒక కోర్టులో బెయిల్ నిరాకరిస్తే సెషన్స్ కోర్టుకు వెళ్లాం. పరీక్షలకు హాజరవ్వాల్సిన ఓ మహిళ, మరో విద్యార్థి తరఫున బెయిల్ పిటిషన్ వేశాం' అని ఆయన చెప్పారు. గత 15 సంవత్సరాలుగా మసీదులో మతబోధకుడిగా పనిచేస్తున్న ముఫ్తీ అనాస్ మాట్లాడుతూ 'ఎన్నో శోభాయాత్రలు చూశాను. కానీ మసీదు, దర్గా మీదుగా ప్రదర్శన సాగడం ఇదే మొదటిసారి. అయినా వారి ఉత్సవం జరుపుకోవాలంటే మా ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయాలా?' అని ప్రశ్నించారు. ఇది పథకం ప్రకారం జరిగిన పనేనని ఆయన చెప్పారు. ప్రార్థనలు చేస్తుంటే మసీదుపై రాళ్లు పడ్డాయని, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని, దుండగులు లోపలికి ప్రవేశించి నమాజు చేస్తున్న వారిపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. మధ్యాహ్నం నమాజ్ చేస్తుంటే దుండగులు తమ ఇళ్లపై రాళ్లు రువ్వారని ఖేరున్నీసా అనే మహిళ వాపోయింది. ఆ ప్రాంతంలో దేవాలయం ఏమీ లేదని, హిందువులు కూడా ఎవరూ నివసించడం లేదని, అలాంటప్పుడు అక్కడ వారికి ఏం పనని ప్రశ్నించింది. పోలీసులు వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థనలు జరిగేటప్పుడే దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా అల్లర్లు జరిగాయని లౌకికవాదంపై అధ్యయనం చేస్తున్న కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ నేహా ధబాడే గుర్తు చేశారు. ముస్లింలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు హిందూ పండుగను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఆమె చెప్పారు. హింసాకాండ అనంతరం ముస్లింలను కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. పోలీసులు అమాయకులను నిర్బంధించి ప్రశ్నిస్తున్నారని, మహిళలు సహా అనేకమంది ముస్లింలను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఒకవైపు హింసను సహించబోమని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను వేధిస్తోందని ధబాడే విమర్శించారు. హిందువుల పండుగలపై ముస్లింలు దాడులు చేస్తున్నారంటూ ఎదురు కేసులు పెడుతున్నారని ఆమె వాపోయారు.