Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో 'బీజేపీ విదేశీ స్నేహితుల సంఘం' వ్యవస్థాపక సభ్యుడొకరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు అక్కడి కోర్టు నిర్ధారించింది. బాలేష్ ధన్కర్ అనే ఈ బీజేపీ 'స్నేహితుడు' మాదకద్రవ్యాలు, లైంగికదాడులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడని సిడ్నీలోని జిల్లా కోర్టు ధృవీకరించింది. ధన్కర్ పైశాచిక అకృత్యాలపై న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని ఆస్ట్రేలియా మీడియా వ్యాఖ్యానించింది. 'సిడ్నీ చరిత్రలో అత్యంత క్రూరుడైన అత్యాచార నిందితులలో ధన్కర్ ఒకరు' అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ధన్కర్పై 13 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. ఆరుసార్లు ఆయన మహిళలకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడులు చేశాడు. మహిళల అనుమతి లేకుండా ఆ అఘాయిత్యాలకు సంబంధించి 17 సార్లు వీడియోలు తీశాడు. 2018 జనవరి-అక్టోబర్ నెలల మధ్య అతను మొత్తం 39 నేరాలకు పాల్పడ్డాడు. వీటన్నింటినీ కోర్టు నిర్ధారించింది.
ప్రధాని నరేంద్ర మోడీతో ధన్కర్ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. 2014లో సిడ్నీలో జరిగిన మోడీ రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటులో 'బీజేపీ స్నేహితుల సంఘం' ప్రముఖ పాత్ర పోషించింది. ధన్కర్ అకృత్యాలు వెలుగులోకి రాగానే ఈ సంఘం మాట మార్చి అతను 2018లోనే రాజీనామా చేశాడని చెప్పుకొచ్చింది. సిడ్నీలోని హిల్టన్ హోటల్ బార్లో అనువాదకుల కోసం ధన్కర్ పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఇంటర్వ్యూ కోసం వచ్చిన కొరియా మహిళలకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ నేరాలకు అతను చాలా సంవత్సరాలు జైలులో గడపాల్సి రావచ్చునని న్యాయ నిపుణులు తెలిపారు.