Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కేంద్రం యత్నం
- సీజీఎంలకు మోడీ సర్కార్ ఆదేశాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీల ఆస్తుల విక్రయ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. అమ్మకానికి వీలున్న ఆస్తులను వేగంగా గుర్తించాలని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు టెలికం శాఖ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. రూ.10 కోట్ల వరకు విలువ కలిగిన కీలక, కీలకేతర ఆస్తులను గుర్తించాలని సూచించినట్టు ఈ వ్యవహారంతో సంబంధ కలిగిన వ్యక్తులు పేర్కొన్నట్టు ఎఫ్ఈ రిపోర్ట్ చేసింది. ఇప్పటికే ప్రతీ సర్కిల్లో బీఎస్ఎన్ఎల్ కనీసం 10 ఆస్తులను అమ్మకానికి వీలుగా గుర్తించింది. ప్రభుత్వ టెల్కోలకు ఇచ్చిన రూ.1.65 లక్షల కోట్ల పునరుద్దరణ ప్యాకేజీకి సంబంధించిన రుణ, వడ్డీ చెల్లింపులు, మూలధన వ్యయాల కోసం ఆస్తుల నగదీకరణ చేయాలని టెలికం శాఖ పేర్కొందని సమాచారం. సులభంగా అమ్మకానికి వీలయ్యే ఆస్తులను తొలుత గుర్తించాలని ఆయా సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లను ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీజీఎంలకు సూచనలు ఇచ్చారు. ఇంతక్రితం ఫిబ్రవరిలో రూ.50 కోట్ల విలువ చేసే తొమ్మిది ఆస్తుల విక్రయానికి గాను బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
రూ.10 కోట్ల లోపు విలువ చేసే ఆస్తుల విక్రయానికి మంత్రి వర్గం ఆమోదం అవసరం ఉండదు. రూ.10 కోట్ల పైబడిన ఆస్తులకు మాత్రమే మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి. బీఎస్ఎన్ఎల్కు చెందిన రూ.18,200 కోట్ల ఆస్తులు, ఎంటీఎన్ఎల్కు సంబంధించి రూ.5,158 కోట్ల ఆస్తులను విక్రయించడానికి గత ఫిబ్రవరిలో దీపమ్ ఆమోదం తెలిపింది. 2022 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 13 ఆస్తులను కేంద్రం వేలానికి పెట్టింది. వీటికి డిసెంబర్ 5 నుంచి బిడ్డింగ్‌లను అహ్వానించింది. ఆస్తుల నగదీకరణలో భాగంగా వీటిని అమ్మేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లిలోని ఆస్తులు,తెలంగాణలోని పటాన్చెరు ఆస్తులు ఈ వేలం లో ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలియాల్సి ఉన్నది.