Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటింగ్‌పై అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం ఎఫెక్ట్
సర్వేలో వెల్లడించిన కన్నడ ఓటరు
బెంగళూరు : కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అవినీతి కీలక అంశంగా మారనున్నది. అలాగే, ధరల పెరుగుదల, నిరుద్యోగం అంశాలు కూడా ఇక్కడి ఓటింగ్‌పై ప్రభావం చూపనున్నది. కన్నడ సంస్థ 'ఈడిన' నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఈ సర్వేలో భాగంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్న తరుణంలో ఏవైనా రెండు సమస్యలను తెలపాల్సిందిగా సర్వేలో పాల్గొన్న ప్రజలను అడిగారు. ఇందులో 68 శాతం మంది అవినీతి సమస్య తమ ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ధరల పెరుగుదలపై 47 శాతం మంది, నిరుద్యోగంపై 34 శాతం మంది తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 13 శాతం మంది ప్రజలు మాత్రం మహిళల భద్రత, తాగునీరు, విద్యుత్తు వంటివి మేజర్ సమస్యలను.. అవి తమ ఓటింగ్ నిర్ణయంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. 12 శాతం మంది ఆరోగ్యం, విద్య అని చెప్పగా.. 10 శాతం మంది నేరాలు, అల్లర్లు, వేధింపుల గురించి మాట్లాడారు. కాగా, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, వొక్కలిగ, కురుబ సామాజిక వర్గం వారు ప్రస్తుత బీజేపీ సర్కారు కొనసాగడానికి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కిందటి సర్వేలో తేలిందని 'ఈడిన' వెల్లడించింది.రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెలువడిన విషయం విదితమే. ఈ విషయంలో గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 13వేల పాఠశాలలు ప్రధాని మోడీకి కూడా లేఖలు రాశాయి. విద్యా శాఖ ముడుపులు డిమాండ్ చేస్తున్నదని ఆరోపించాయి. అలాగే, కర్నాటక మంత్రి అవినీతిని పేర్కొంటూ సంతోశ్ కె. పాటిల్ అనే కాంట్రాక్టర్ గతేడాది ఏప్రిల్‌లో బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. అలాగే, నిత్యవసర ధరలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల రాష్ట్రంలోని ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలయ్యాయని నిపుణులు తెలిపారు. అలాగే, ఇక్కడి యువత నిరుద్యోగం విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్నదన్నారు. దీనికితోడు సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓటమి దిశగా తీసుకెళ్లడం ఖాయమని చెప్పారు.