Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠ్యాంశాలను
- స్టేట్ పుస్తకాల్లో చేర్చేందుకు కేరళ నిర్ణయం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తున్న కేరళ ప్రభుత్వం ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్‌లో చేర్చడం ద్వారా అనుబంధ పాఠ్య పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఎన్సీఈఆర్టీ ఇటీవల 10, 11, 12 తరగతికి చెందిన చరిత్ర, రాజకీయ శాస్త్రం పుస్తకాల నుంచి కొన్ని భాగాలను తొలగించింది. మహాత్మాగాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు, మొఘలుల చరిత్ర, ఆర్ఎస్ఎస్పై నిషేధం, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మినహాయించడం వంటి కొన్ని ముఖ్యమైన భాగాలను పాఠ్యాంశాల నుంచి తొలగించింది. ఈ చర్యను కేరళ ప్రభుత్వం బహిరంగంగానే విమర్శించింది. పాఠ్యపుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే కేంద్రం చర్య గర్హనీయమని పేర్కొంది. ఎన్సీఈఆర్టీని పునర్వస్థీకరించాలనీ, ఇందులో రాష్ట్ర ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ చేసింది. తొలగించిన భాగాలతో అనుబంధ పాఠ్యపుస్తకాలను తీసుకురావడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని కూడా తెలిపింది.
ఇందుకనుగుణంగానే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ ) కరిక్యులమ్ స్టీరింగ్ కమిటీ సమావేశమై తొలగించిన భాగాలపై సమగ్రంగా చర్చించింది. ఈ చర్య సహేతుకం కాదని కమిటీ అభిప్రాయపడింది. రేషనలైజేషన్ పేరుతో తొలగించిన భాగాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేరళ పాఠ్యాంశాలలో వీటిని యథాతథంగా ఉంచాలని అభిప్రాయపడింది.
అనుబంధ పాఠ్యపుస్తకాలు
కాగా, చరిత్ర, రాజకీయ శాస్త్రం, అర్ధశాస్త్ర, సోషియాలజీలో కొన్ని భాగాలను ఎన్సీఈఆర్టీ తొలగించడం సహేతుకం కాదని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.జయచంద్రన్ మండిపడ్డారు. తొలగించిన భాగాలను అనుబంధ పాఠ్యపుస్తకాలలో చేర్చి, వాటిని రాష్ట్రంలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రెండు నెలల్లో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తామని, ఆగస్టు నాటికి పుస్తకాలు విద్యార్థులకు చేరుతాయని తెలిపారు. స్టీరింగ్ కమిటీ చైర్మెన్‌గా ఉన్న కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్కుట్టి సైతం ఇప్పటికే పాఠ్యాంశాల్లో ఎన్సీఈఆర్టీ చేసిన మార్పులపై కేంద్రాన్ని, ఎస్సీఈఆర్టిని తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ మార్పులు చేశారని ఆరోపించారు.