Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణలో కేంద్రం విఫలం
- కొండెక్కిన ధరలు
న్యూఢిల్లీ : మన దేశం ప్రపంచంలోనే పప్పు ధాన్యాలను అత్యధికంగా వినియోగిస్తోంది. అంతేకాదు... పప్పు ధాన్యాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా మనదే. పప్పు ధాన్యాలు, వంట నూనెలను పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకుంటున్నాం.ఉత్పత్తి తక్కువగా ఉండడంతో 2021-22 పంట కాలంలో వీటి దిగుమతులు 9.44 శాతం పెరిగి 27 లక్షల టన్నులకు చేరాయి. 2020-21లో 24.66 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మన దేశం దిగుమతి చేసుకుంది. పెసలు, మినుములు, ఎర్ర కందులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాటి ధరలు 30 శాతం మేర పెరిగాయి.
దేశంలో అధికంగా వినియోగించే కందిపప్పు ధర కిలో రూ. 185 పలుకుతోంది. కిలో పెసరపప్పు రూ. 249, మినప్పప్పు రూ. 115, ఎర్ర కందిపప్పు రూ. 160 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం చోద్యంలా చూస్తోందన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
దేశంలో పప్పు ధాన్యాల వినియోగం అధికంగా ఉన్నప్పటికీ ఇతర పంటలతో పోలిస్తే పప్పు ధాన్యపు పంటల ఉత్పత్తి ఏ మాత్రం పెరగడం లేదు. ఫలితంగా మన దేశం పప్పు ధాన్యాలు, వంట నూనెలను అంతర్జాతీయ మార్కెట్ల నుండి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది.
సరైన విధానపరమైన చర్యలు చేపట్టినట్లయితే వీటిని దేశీయంగానే సులభంగా ఉత్పత్తి చేయగలం. ఈ సంవత్సరం మార్చి 23 వరకూ మన దేశం 8.75 లక్షల టన్నుల బఠాణీలను, 5.12 లక్షల టన్నుల మినుములను దిగుమతి చేసుకుంది. 2022-23లో కందుల ఉత్పత్తి 9.8 శాతం, మినుముల ఉత్పత్తి 12 శాతం తగ్గిపోయింది. బీహార్లో కందుల ధర 89 శాతం పెరిగింది. ఈ నెలలో క్వింటాలు ధర రూ. 14,500 పలికింది. గత సంవత్సరం ఇదే నెలలో దీని ధర రూ. 7,681 మాత్రమే.
లాభాలు తెచ్చిపెట్టే సోయాబీన్, పత్తి పంటల వైపు రైతులు మొగ్గు చూపడంతో పప్పు ధాన్యాల ఉత్పత్తి పడిపోతోంది. పప్పు పంటల విస్తీర్ణం ఆరు శాతం తగ్గడం, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో కోతలకు ముందు భారీ వర్షాలు కురవడం వల్ల కూడా ఉత్పత్తి తగ్గిపోయింది. అనేక రాష్ట్రాలలో బలమైన ఈదురు గాలులు వీచడం వల్ల గోధుమలు, పప్పు ధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. పప్పు ధాన్యాల లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉండేలా చూసేందుకు, దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మినుములు, కందుల స్వేచ్ఛా దిగుమతి విధానాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగించింది. అయితే పప్పు ధాన్యాలను కేంద్రం దిగుమతి చేసుకుంటున్నంత వరకూ తమకు లాభాలు రాబోవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పప్పు ధాన్యాలకు సంబంధించి రైతుకు కనీస మద్దతు ధర కంటే తక్కువే లభిస్తోంది.
వినియోగదారులకు పప్పులు తక్కువ ధరకే లభించాలంటే గోధుమలు, బియ్యం మాదిరిగా వాటిని కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు. పప్పుల మార్కెట్ ధరల కంటే కనీస మద్దతు ధర తక్కువగానే ఉంటోంది. దీంతో రైతులు పప్పు పంటల వైపు మొగ్గ చూపడం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. దిగుమతి బిల్లులు పెరుగుతున్నాయి. వాణిజ్య సమతూకం దెబ్బతింటోంది. కనీస మద్దతు ధరల్లో తేడాల కారణంగా బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయ పంటలు వేయడం రైతులకు సవాలుగా మారింది. పైగా బియ్యం, గోధుమలు రాజకీయ పార్టీలకు అతి పెద్ద 'ఓటు బ్యాంకు'గా మారాయి. వీటిని కాదని వేరే పంటల వైపు మరలితే రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందేమోనని పార్టీలు భయపడుతున్నాయి.
ప్రభుత్వాల కలవరం..
ఎన్నికల సంవత్సరంలో పప్పుల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కలవరపాటుకు గురవుతున్నాయి. కందులు, మినుముల నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిల్వదారులు, మిల్లర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, వ్యాపారులపై ఒత్తిడి తెస్తోంది. అంతేకాక పప్పుల ధరల పర్యవేక్షణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. కానీ ధాన్యపు పంటలకు బదులుగా పప్పు ధాన్యాల పంటల వైపు రైతులను మళ్లిస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. దీనితో పాటు పప్పు పంటల రైతులకు సులభంగా రుణాలు అందించడం, బీమా సౌకర్యం కల్పించడం, ఆకర్షణీయమైన కనీస మద్దతు ధర ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఉత్పత్తిని పెంచే అవకాశం ఉన్నదని రైతు సంఘాల నేతలు అంటున్నారు..
మాంసకృత్తులు లభించాలంటే పప్పులే శరణ్యం
పేదలకైనా, ధనికులకైనా, శాఖాహారులకైనా, మాంసాహారులకైనా పప్పు ధాన్యాల వాడకం తప్పనిసరి. మన దేశంలో ఏటా రెండు కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ ఉత్పత్తిలో మన వాటా ఇరవై ఐదు శాతమే. అదే సమయంలో.. ప్రపంచంలో వినియోగిస్తున్న పప్పు ధాన్యాలలో ఒక్క మన దేశంలోనే 27 శాతం వినియోగం అవుతోంది. సామాన్య ప్రజలకు మాంసకృత్తులు లభించాలంటే పప్పులే శరణ్యం. ఇంత ప్రాధాన్యత ఉన్న పప్పు ధాన్యాల ఉత్పత్తికి అవరోధంగా అంశాలేంటీ..?