Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ప్రజా సంఘాలు
- ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద మహిళా సంఘాల నిరసన
- ఐద్వా నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- ఐదో రోజు కొనసాగిన రెజ్లర్ల ఆందోళన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశం గర్వించదగ్గ అగ్రశ్రేణి క్రీడాకారులను లైంగిక వేధింపు లకు పాల్పడి చిత్రహింసలు చేసి న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతున్న బీజేపీ, మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ, సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణ ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎంపీ, రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ (డబ్ల్యూఎఫ్ఐ)పై తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐదు ప్రజా సంఘాలు ఉమ్మడిగా పిలుపు మేరకు గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల విస్తృత ప్రదర్శనలు, ధర్నాలు, మానహారాలు, దిష్టిబొమ్మ దహనం, స్థానిక అధికారులతో రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. ఈ ఆందోళనల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు (ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు) ఫిర్యాదులు చేసినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దిగ్భ్రాంతికరమని, రాజధాని నగరంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు. నిందితుడు అధికార పార్టీ బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడని, నిందితులను రక్షించడానికి ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం నానాయాతన పడుతుందని వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుందని అన్నారు. బాధిత మహిళలు న్యాయం కోసం వీధిలో పడుకోవాల్సిన ఈ అరాచక పరిస్థితికి మోడీ ప్రభుత్వామే కారణమని పేర్కొన్నారు.
రాష్ట్రపతి జోక్యం చేసుకోండి
బ్రిజ్ భూషణ్ పైఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితులను అరెస్టు చేసి బాధిత మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేలా ఢిల్లీ పోలీసులను, ప్రధానిని ఆదేశించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. దేశ అత్యున్నత పరిపాలనా స్థానంలో ఉన్న మహిళగా మీ కనీస బాధ్యతని రాష్ట్రపతిగా మీ నుంచి ఆశిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తక్షణమే రాజీనామా చేయాలని, అన్ని ఆరోపణలపై విచారణ జరిపి దోషులందరిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్రపతిని కోరారు. క్రిమినల్ మాఫియాతో బాధితులను బెదిరించిన నేరానికి పాల్పడిన వారిని, ఫిర్యాదులను పట్టించుకోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు అధికారులపై కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. తపన్ సేన్ (సీఐటీయూ), విజ్జూ కృష్ణన్ (ఏఐకేఎస్), బి. వెంకట్ (ఏఐఎడబ్ల్యూయూ), మరియం ధావలే (ఐద్వా), హిమఘ్నరాజ్ భట్టాచార్య (డివైఎఫ్ఐ), మయూక్ బిస్వాస్ (ఎస్ఎఫ్ఐ) ప్రకటన విడుదల చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఐదో రోజు కొనసాగిన రెజ్లర్ల ఆందోళన
రెజ్లర్ల ఆందోళన ఐదో రోజు కూడా కొనసాగింది. ఢిల్లీలో జంతర్ మంతర్‌లో ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్, మరియం దావలే, నేతలు శైలజా టీచర్, సిఎస్ సుజాత, డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టా చార్య, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్, జెఎన్ యు ఎస్ యు అధ్యక్షురాలు ఐషీఘోష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆర్ఎల్డి నేత, రాజ్యసభ ఎంపి జయంతి చౌదరి, ఆర్ఎల్పి నేత, ఎంపి హనుమాన్ బెనివాల్ ఒలింపిక్ విజేత గీతా ఫోగట్ సంఘీభావం తెలిపారు. సత్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడిపోకూడదని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు.
ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన
క్రీడాకారుల ఫిర్యాదు మేరకు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. ఐద్వా, ఎన్ఎఫ్డిడబ్ల్యుఎ, ఎఐఎంఎస్‌ఎస్, పిఎంఎస్, సిఎస్‌డబ్ల్యూ సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఐద్వా ఢిల్లీ అధ్యక్షురాలు మైమూనా మొల్లా తదితర నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నేతలను ఈడ్చుకెళ్లి బస్సులోకి ఎక్కించారు. ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు యాభై మంది మహిళ నేతలు పాల్గొన్నారు.