Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక అభ్యర్థులకు ఓటర్ల వివరాల విక్రయం
- బెంగళూరు సంస్థ నిర్వాకం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారిక పోర్టల్ 'ఎరోనెట్' నుంచి విలువైన సమాచారం చౌర్యానికి గురైంది. ఓటర్ల వివరాలన్నీ ఈ పోర్టల్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. వాస్తవానికి ఈ పోర్టల్‌లోని సమాచారం కేవలం ఎన్నికల అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ బెంగళూరుకు చెందిన ఓ ప్రయివేటు సంస్థ ఈ సమా చారాన్ని దొంగిలించి, కర్నాటక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అమ్ముకుంటోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల వివరాలు సేకరించి, వారిని ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
దీనిని అవకాశంగా తీసుకొని బెంగళూరు సంస్థ ఆ సమాచారాన్ని ఆయా పార్టీలకు బేరం పెట్టింది. లక్షలాది ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వివరాల న్నింటినీ ఈ సంస్థ సేకరించింది. కర్నాటకలోని పార్టీలు, అభ్యర్థులు కేవలం పాతిక వేల రూపాయలకే తమ కు కావాల్సిన ఓటర్ల సమాచారాన్ని కొనుగోలు చేస్తు న్నారని 'ది న్యూస్ మినిట్' అనే పత్రిక తెలిపింది. బెంగళూరు సంస్థ యజమాని ఎవరో తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ కేవలం ఓటర్ల సమాచారాన్ని మాత్రమే విక్రయించిందా లేక యూపీఐ ద్వారా వారి ఖాతా లలో సొమ్ము జమ చేసి వారి ఓట్లను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించిందా అనే విషయాన్ని కూపీ లాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
దేశంలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఓటర్ల సమాచారాన్ని విక్రయించిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ వ్యవహారమంతా ఓటర్లకు తెలియకుండానే, వారి అనుమతి తీసుకోకుండానే జరిగిపోతోంది. దేశంలో సమాచార భద్రత, గోప్యతకు సంబంధించి ఇలాంటి ఉదంతాలు అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంలో ఒక కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్ తరఫున బెంగళూరు డివిజన్ ప్రాంతీయ కమిషనర్ అమల్ ఆదిత్య బిశ్వాస్ విచారణ జరిపారు. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) తరఫున పనిచేసిన పలువురు అధికారు లు చిల్యూమ్ అనే ప్రైవేటు ట్రస్ట్‌కు అవాంఛనీయ, అక్రమ లబ్ది చేకూర్చారని ఆయన తేల్చారు. ఓటర్ల సమాచారాన్ని సేకరించేందుకు వారు ఆ ట్రస్ట్‌కు అనుమతి ఇచ్చారని నిర్ధారించారు.
రాజు అనే స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో తాజా చౌర్యం వెలుగులోకి వచ్చింది. ఓటర్ల సమాచారాన్ని అమ్మే వ్యక్తి ఫోన్ ద్వారా రాజును సంప్రదించాడు. ఆ వెంటనే ఆయన ఈ విషయాన్ని ఎన్నికల అధికారి శ్రీనివాస్ దృష్టికి తీసికెళ్లారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 24న కేసు నమోదు చేశారు. రాజుకు ప్రైవేటు సంస్థ ఇచ్చిన లాగిన్ వివరాలతో 'ది న్యూస్ మినిట్' పత్రిక ఆ పోర్టల్‌లో ప్రవేశించింది. అందులో ఆరున్నర లక్షల మంది ఓటర్ల సమాచారం ఉంది. ఎన్నికల కమిషన్‌లో పనిచేస్తున్న వారు ఈ చౌర్యానికి పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమాని స్తున్నారు. హ్యాకింగ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదని వారు తెలిపారు. చౌర్యానికి పాల్పడిన కంపెనీని ఈ నెలలో ఢిల్లీలో రిజిస్టర్ చేసినట్లు మాత్రమే సమాచారం అందు బాటులో ఉంది. కంపెనీ పోర్టల్‌లోకి వెళితే 'ఇరవై ఐదు వేలు చెల్లించి ఓటర్ల వివరాలు పొందండి. ఎన్నికలలో విజయం సాధించండి' అనే సందేశం కన్పిస్తోంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలన్నీ ఇందులో లభిస్తున్నాయి.
దేశంలోని సమాచార రక్షణ చట్టాలను మరింత బలో పేతం చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం నొక్కి చెబుతోం ది. పౌరుల సమాచార గోప్యతను కాపాడేందుకు, సమాచా రం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం తక్ష ణమే కఠిన చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.