Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమోదు చేసిన కాంగ్రెస్
బెంగళూరు : కేంద్ర హౌం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ గురువారం కేసు నమోదు చేసింది. అమిత్షా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డి.కె.శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కోరారు. ఈ వ్యాఖ్యలు ఒక సామాన్యుడు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని కేంద్ర హౌం మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. అమిత్ షా దేశానికి హౌంమంత్రి అనీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాదని విమర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత కల్లోలాలు పెరుగుతాయని కర్నాటకలోని బెల్గావి జిల్లా తెర్డాల్లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోకపోతే అభివృద్ధి రివర్స్ గేర్ లోకి వెళ్తుందని హెచ్చరించారు. కర్నాటకలో మే 10న ఓటింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.