Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతన్న పాదయాత్రతో ప్రభుత్వంలో చలనం
- అన్నదాతలతో ప్రభుత్వ ప్రతినిధి బృందం చర్చలు
- తాత్కాలికంగా మార్చ్ నిలిపివేత
ముంబయి: రైతన్నకు ఇచ్చిన హామీలు, డిమాం డ్లను నెరవేర్చే విషయంలో మహారాష్ట్ర సర్కారు మాట తప్పుతున్నది. కొన్ని రోజుల కిందే ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టిన అన్నదాతలు మళ్లీ అలాంటి పోరాటానికే సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రైతులు చేపట్టిన పాదయాత్ర రెండో రోజు వాయిదా పడింది. యాత్రలో భాగంగా దందర్ఫాల్ లోని రామేశ్వరం ఆలయంలో అన్నదాతలు విడిది చేశారు. అయితే, పాదయాత్రకు వచ్చిన స్పందన మహారాష్ట్ర సర్కారును ఆందోళనకు గురి చేసింది. దిగొచ్చిన షిండే సర్కారు చర్చలకు సిద్ధపడింది. దీంతో ప్రభుత్వ ప్రతినిధి బందం రైతులతో సమావేశమై మాట్లాడనుంది.
అయితే, పోలీసు నోటీసులతో ప్రభుత్వం నుంచి బెదిరింపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతుల ఆత్మధైర్యాన్ని అరికట్టలేకపోయింది. బుధవా రం మొదటి రోజు వేలాది మంది రైతులతో సాయం త్రం 4 గంటలకు ప్రారంభమైంది. అకోల్ మార్కెట్ నుంచి రామేశ్వరం దేవాలయం (ధండర్ ఫాల్, తహసీల్ సంగమ్నేర్) వరకు సుమారు 12 కిలో మీటర్ల దూరాన్ని కవర్ చేసింది. రైతులు ఆ రోజు రాత్రి ఆరుబయటే గడిపారు. మరుసటి రోజు ఉద యం 7 గంటలకు రామేశ్వరం ఆలయం నుంచి ఖాటోడ్ లాన్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరారు. యాత్రలో పాల్గొంటున్న వేలాది మంది రైతులు, యాత్రకు వస్తున్నన మద్దతు ను చూసిన ప్రభుత్వం, రైతులు ముందుకు సాగొద్దని చెప్పింది. రైతు ప్రతినిధులతో చర్చలు ప్రారంభిం చింది. దీంతో రైతు నేతలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాదయాత్రను రైతులు నిలిపివేశారు.
తొలిరోజు ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా రైతుల ఉత్సాహంలో ఎలాంటి తేడా కనిపించలేదు. రాత్రి 10 గంటల తర్వాత కూడా రైతులంతా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొలాల్లో కూర్చుని మాట్లాడుకు న్నారు. రెండో రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. కొందరు రైతులు గుడి, ఆడిటోరియంలో ఎక్కడో చెట్లకింద ఆశ్రయం పొందగా.. చాలామంది తమ వాహనాల వైపు పరుగులు తీశారు. వర్షం ఎక్కువసేపు కురవక పోవడంతో తీవ్రమైన ఎండలకు వాతా వరణం మళ్లీ వేడెక్కింది. జర్నలిస్టులు మండుతున్న ఎండను తట్టుకోలేక తమ వాహనాల ఎయిర్ కండిషనర్లలో సేద తీరగా.. రైతులు మాత్రం దాదాపు 10 కిలో మీటర్ల దూరం పాదయాత్రను చేశారు. తమ నాయకులు తమకు దిశానిర్దేశం చేస్తే మిగిలిన 40 కిలోమీటర్ల యాత్రను ఒక్కరోజులో పూర్తి చేస్తామని చెప్పారు.అకోల్ నుండి బయలుదేరే ముందు సుదీర్ఘయాత్ర కోసం అనేక ఏర్పాట్లను చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఈ గిరిజన రైతులకు ఈ యాత్ర మొదటిది కాదు. వారు ఇప్పటికే అలాంటి మూడు మార్చ్‌లను నిర్వహించారు. గత పాదయాత్రల అనంతరం ప్రభుత్వం వారి డిమాండ్లను ఆమోదిం చింది. అయితే తమ డిమాండ్ల అమలులో ప్రభుత్వం మోసం చేస్తున్నదని రైతులు వాపోతున్నారు.
అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోల్ నుంచి లోనీ వరకు జరిగిన ఈ లాంగ్ మార్చ్‌కు సంబంధించి పోలీసులు సెక్షన్ 149 కింద నోటీసు జారీ చేసి నిరసనకారులకు అనుమతి నిరాకరించారు. అయితే దీని వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం పడలేదు. దీనిపై ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్ నావాలే మాట్లాడుతూ.. పోలీసులు రైతులకు శత్రువు కాదన్నారు. వారి పని వారు చేసుకుపోతున్నారనీ, నేడు ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. ఎండలో పనిచేస్తూ జీవితాలు గడు పుతున్న రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కావడం లేదనీ, వేసవిలో రైతుల చెమటకు విలువ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మేం పగలు, రాత్రి మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అధికారులు, మంత్రుల సమావేశాల్లో సీరియస్‌నెస్ లేదనీ, అందుకే ఈ పాదయాత్రను ఏకగ్రీవంగా చేపడుతున్నామని చెప్పారు.
డిమాండ్లు నెరవేరకపోతే నిరవధిక సమ్మె: రైతులు
ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదరు నరకర్ మాట్లాడుతూ..గత నెల లాంగ్ మార్చ్ తర్వాత ప్రభు త్వం మా డిమాండ్లను అంగీకరించి, వాటిని అమ లు చేసేందుకు కమిటీని కూడా వేసింది. అయితే ఆ కమిటీ చైర్మెన్, రెవెన్యూ మంత్రి రాధాకష్ణ పాటిల్ వాటిని అమలు చేయలేదన్నారు. అందుకే తాము మరోసారి పోరాట బాట పట్టాల్సి వచ్చిందని చెప్పా రు. రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే మహా రాష్ట్ర లోని మంత్రి పాటిల్ కార్యాలయం దగ్గర నిర వధిక దీక్షకు దిగుతామని రైతు నాయకులు హెచ్చరించా రు. రైతుల సమస్యలపై గత నెలలో ఏఐకేఎస్ నాసిక్ జిల్లా నుంచి ముంబయి వైపు లాంగ్ మార్చ్ చేపట్టిం ది. ఇందులో ఉల్లి రైతులకు సబ్సిడీలు, గిరిజన ప్రాబ ల్యం ఉన్న జిల్లాల్లో భూ యాజమాన్యం, రుణమాఫీ సహా 14 డిమాండ్లు లేవనెత్తిన విషయం తెలిసిందే.
రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు?
తాము రైతులు, వ్యవసాయ కార్మికులకు అటవీ భూమిని అప్పగించడం, యాజమాన్యం గురించి మాట్లాడుతున్నామని నవాలే తెలిపారు. అలాగే, పత్తి, పాలు, సోయాబీన్, అర్హార్, పెసర, ఇతర ఉత్పత్తు లకు లాభదాయకమైన ధరలను కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. విదర్భకు చెందిన పలువురు రైతులు తమ ప్రధాన పంటలలో ఒకటైన పత్తి ధరలు గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోయాయని తెలి పారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న ఐద్వా ప్రధాన కార్య దర్శి మరియం ధావలే మాట్లాడుతూ.. రైతుల ఈ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నా రని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వారి ఇండ్లలోకి బలవంతంగా ప్రవేశించి వారితో అనుచితంగా ప్రవర్తించారని చెప్పారు. దేశ పార్లమెంటు వారికి హక్కులను కల్పించే చట్టాన్ని ఆమోదించినా.. ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదని తెలిపారు.