Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంలోని పౌరుల ఇక్కట్లు
- పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాట్లు
- సరైన పత్రాలు చూపెట్టకపోతే 20 లక్షల మంది సిటిజెన్షిప్ కోల్పోయే ఛాన్స్
న్యూఢిల్లీ : మోడీ పాలనలో సొంత దేశ పౌరులే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఏండ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. వారు భారతీయులే అని నిరూపించుకోవడానికి 1971 నాటి పత్రాలను అందించాలని ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు 50 ఏండ్ల క్రితం నాటి ఆస్తి దస్తావేజు లేదా పూర్వీకుల పేరుతో ఉన్న జనన ధృవీకరణ పత్రం వంటివి సమర్పించాలంటే ఎలా సాధ్యమని అక్కడి పౌరులు ప్రశ్నిస్తున్నారు.
ఇలా దాదాపు 20 లక్షల మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఈ సంఖ్య అసోం జనాభాలో ఐదు శాతం. ప్రభుత్వం చెప్తున్నట్టుగా తాము భారతీయులమేనని తగిన పత్రాలు చూపెట్టకపోతే వారి పౌరసత్వం తొలగిపోయే ప్రమాదమున్నది. దీనిపై ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క భారత్ అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదని మోడీ ప్రభుత్వం ప్రపంచ వేదికల్లో సైతం ప్రచారం చేసుకుంటున్నది. కానీ, సొంత దేశంలోని ప్రజలనే పరాయిలుగా చేస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్న విషయం అంతర్జాతీయ సమాజంలోనూ చర్చ జరగాలని సామాజిక కార్యకర్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫెడరల్ ఆడిట్ లోపభూయిష్టంగా ఉన్నదని గుర్తించిన తర్వాత అసోంలో ప్రక్రియ నిలిపివేయబడినప్పటికీ.. అధికార బీజేపీ దేశవ్యాప్తంగా ఇలాంటి ధృవీకరణ కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ.. అసోంలో ఓటు హక్కు కలిగిన వందలాది మంది అనుమానిత వలసదారులను అరెస్టు చేశారు. వారిని ట్రాన్సిట్ క్యాంపులు అని పిలిచే నిర్బంధ కేంద్రాలకు పంపింది.అరెస్టు భయంతో వేలాది మంది ఇతర భారతీయ రాష్ట్రాలకు పారిపోయారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక్కడ అనుమానాస్పదంగా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాయని ఆరోపించబడుతున్నవారిలో చాలా మందికి ఓటర్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఏండ్లుగా ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వారి జనన ఆధారాలు చూపించాలంటే వారు ఎక్కడి నుంచి చూపిస్తారని సామాజిక వేత్తలు, పౌర సంఘాల నాయకులు ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారన్న పేరుతో కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని మోడీ సర్కారు, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో భావోద్వేగాలతో కూడుకున్న అంశాలపై రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటేననీ, ఇందులో భాగంగానే విదేశీ పౌరులంటూ ఇక్కడి ఒక వర్గం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు.